ఇప్పటికి ఇక సెలవు

‘‘నా మొదటి సినిమా ‘కిలాడి కృష్ణుడు’ నుంచి ప్రస్తుతం నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ వరకు నన్ను ఆదరించిన ప్రేక్షకులు, అభిమానులకు ధన్యవాదాలు’ అంటూ సామాజిక మాధ్యమాల వేదికగా మనసులో మాట చెప్పారు ప్రముఖ నటి విజయశాంతి. రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆమె దాదాపు 13 ఏళ్ల తర్వాత ‘సరిలేరు’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆమె నటన ముందు విరామం చిన్నబోయింది. ప్రొఫెసర్‌ భారతి అనే పాత్రలో కనిపించి నాటి విజయశాంతిని మళ్లీ ఆవిష్కరించింది. ఈ నేపథ్యంలో మరిన్న సినిమాలు చేస్తుందని భావించారు సినీ ప్రియులు. కానీ, ఎవరూ ఊహించని విధంగా ట్వీట్‌ చేసి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ‘ప్రజా జీవన పోరాటంలో నా ప్రయాణం.. మళ్లీ మరో సినిమా చేసే సమయం, సందర్భం నాకు కల్పిస్తుందో, లేదో నాకు కూడా తెలియదు. ఇప్పటికి ఇక సెలవు. మనసు నిండిన మీ ఆదరణకు, నా ప్రాణప్రదమైన అభిమాన సైన్యానికి ఎప్పటికీ నమస్సులు’ అని పేర్కొన్నారు. ‘మేడమ్‌.. మీరు మళ్లీ సినిమాల్లో నటించాలి, ఎప్పటికీ మీరు నటిస్తూనే ఉండాల’ని నెటిజన్లు కామెంట్స్‌ పెడుతున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.