ఆ ఇద్దరూ నేలతల్లి బిడ్డలే

‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేళ్‌కు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవిత కథను ‘యాత్ర’ ద్వారా చూపించడం చాలా గౌరవంగా ఉంది’’ అంటున్నారు దర్శకుడు మహి వి.రాఘవ్‌. ఈ సినిమాలో వై.యస్‌.ఆర్‌ పాత్రను మలయాళ నటుడు మమ్ముట్టి పోషించారు. 70 ఎం.ఎం.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజయ్‌ చిల్లా, శశిదేవి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. చిత్రాన్ని ఉద్దేశించి దర్శకుడు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘వైఎస్‌ కుటుంబం, అభిమానుల నుంచి మాకు అమితమైన ఆదరణ లభించడం గొప్ప విషయం. చిత్ర బృందం చాలా కష్టపడిచేసింది. ఈ సినిమాను వేరే చిత్రంతో పోల్చి చూడకండి. దీన్ని వై.ఎస్‌.ఆర్‌ ప్రయాణంలా భావిద్దాం. ‘ఎన్టీఆర్, వైఎస్సాô’Â.. ఇద్దరూ ఈ మట్టితల్లి బిడ్డలు. తెలుగు జాతి గర్వించదగ్గ నాయకులు. మన భిన్నాభిప్రాయాలు వారిని అగౌరవపర్చడానికి కారణాలు కాకూడదు. మనకు భిన్నమైన ఆలోచనలు, అభిప్రాయాలు, ఇష్టాలు ఉంటాయి. కాబట్టి మనకు స్ఫూర్తినిచ్చిన వారి సినిమాను సెలబ్రెట్‌ చేసుకుందాం. అదే మనం వారికిచ్చే గొప్ప నివాళి. మా ‘యాత్ర’ సినిమాను ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉంది. నిజాయితీగా మీ స్పందన చెప్పండి. నేను వినయంగా వాటిని స్వీకరిస్తా. ఈసారి ఇంకా ఉత్తమమైన కథతో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తా. ధన్యవాదాలు’’ అని మహి వి రాఘవ్‌ ఆ ప్రకటనలో చెప్పారు. ఫిబ్రవరి 8న ఈ సినిమాను తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

                               


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.