సెట్స్‌పైకి వెళ్లే తొలి నటుడు చిరు!!



కరోనా మహమ్మారి ప్రభావాన్ని గుర్తించి తెలుగు చిత్ర పరిశ్రమలో మొట్ట మొదట చిత్రీకరణలను ఆపేసింది కథానాయకుడు చిరంజీవి. అప్పటికి ఆయన ‘ఆచార్య’ చిత్రం సెట్స్‌పై శరవేగంగా ముస్తాబవుతున్నప్పటికీ.. కార్మికుల భద్రతను దృష్టిలో పెట్టుకోని తన చిత్ర షూటింగ్‌ను నిలిపేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన బాటలోనే చిత్ర పరిశ్రమ మొత్తం స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ పాటించడం షురూ చేసింది. ఇప్పుడీ లాక్‌డౌన్‌ తర్వాత తొలుత సెట్స్‌పైకి అడుగుపెట్టబోతున్న కథానాయకుడు కూడా చిరంజీవే కానున్నారట. జూన్‌ నుంచి సినిమా చిత్రీకరణలకు అనుమతులు ఇవ్వబోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే తెలియజేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పరిశ్రమలో మళ్లీ షూటింగ్‌ల సందడి షురూ కాబోతుంది. అయితే ఇప్పుడు సెట్స్‌పైకి వెళ్లనున్న కథానాయకుల్లో తొలుత సెట్స్‌లోకి అడుగుపెట్టబోయేది చిరునే అని సమాచారం. ఆయన నటిస్తోన్న ‘ఆచార్య’ చిత్రాన్ని జూన్‌ 15 నుంచి సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనికి తగ్గట్లుగా దర్శకుడు కొరటాల శివ కొత్త షెడ్యూళ్లను ఖరారు చేసుకునే పనిలో పడ్డారట. లాక్‌డౌన్‌ తర్వాత ప్రారంభం కాబోయే ఈ చిత్ర కొత్త షెడ్యూల్‌లో భాగంగా.. రెండు పాటలు, ఓ యాక్షన్‌ ఎపీసోడ్‌ను చిత్రీకరించనున్నట్లు సమాచారం. అంతేకాదు సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి.. సంక్రాంతి రేసులో బరిలో నిలవాలని చిత్ర బృందం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక సమాచారం వెలువడే అవకాశముంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.