నటుడు వినోద్‌ కన్నుమూత

ప్రముఖ నటుడు వినోద్‌ (58) శనివారం తెల్లవారుఝామున హైదరాబాద్‌లో కన్నుమూశారు. శుక్రవారం రాత్రి షూటింగ్‌ ముగించుకుని ఇంటికి చేరుకున్న వినోద్‌ అర్ధరాత్రి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. శనివారం తెల్లవారు జామున మూడు గంటలకు కుటుంబ సభ్యులు హుటాహుటిన అమీర్‌పేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన బ్రెయిన్‌ స్ట్రోక్‌తో మృతి చెందినట్లు ధ్రువీకరించారు. వినోద్‌ అసలు పేరు నాగేశ్వరరావు. గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగు ఆయన స్వగ్రామం. 22 ఏళ్ల వయసులోనే పలు నాటకాల్లో విభిన్న పాత్రలు పోషించారు. సినిమాలపై అభిరుచితో మద్రాసు వెళ్లి స్థిరపడ్డారు. ఆయన నట ప్రయాణం కథానాయకుడిగానే మొదలైంది. కొన్ని తెలుగు, తమిళ చిత్రాల్లో కథానాయకుడిగా మెరిశారు. ‘నల్ల త్రాచు’, ‘కీర్తి కాంత కనకం’లో ఆయనే కథానాయకుడు. ఆ తరవాత ప్రతినాయకుడిగా, ప్రతినాయకుడి సహాయకుడిగా తెలుగు, కన్నడ, తమిళం, హిందీ చిత్రాల్లో కలిపి సుమారు 350 పై చిలుకు సినిమాల్లో నటించారు. ‘బదిలీ’ ‘చంటి’, ‘లారీ డ్రైవర్‌’, ‘ఇంద్ర’ ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. ‘బందిపోటు’లో ఆయన హాస్యనటుడిగా అలరించారు. ‘నరసింహనాయుడు’లో పాజిటివ్‌ పాత్ర దక్కింది. ఆ తరవాత బుల్లి తెరవైపూ దృష్టి సారించారు. ఈటీవీ ధారావాహికలు ‘భార్యాభర్తలు’, ‘పద్మవ్యూహం’, ‘అనుబంధం’లలో కీలక పాత్రలు పోషించారు. బాపు ‘భాగవతం’లోనూ నటించారు. వినోద్‌కు భార్య వీణ, కుమారుడు సురేష్‌, ఇద్దరు కుమార్తెలు శిరీష, తేజస్వి ఉన్నారు. వినోద్‌ మృతికి ‘మా’ సంతాపం వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శివాజీరాజా, నటులు ఉత్తేజ్‌, టీవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు హరి, సభ్యులు ఉమా తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. సత్యహరిశ్చంద్ర హిందూ శ్మశానవాటికలో వినోద్‌ భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.