చిత్తూరు పలుకులు మొదలయ్యాయి..

ఈ సంక్రాంతికి ‘అల.. వైకుంఠపురములో’ చిత్రంతో బాక్సాఫీస్‌ ముందుకొచ్చి.. చక్కటి విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు అల్లు అర్జున్‌. ఇప్పుడీ ఉత్సాహంలోనే తన 20వ చిత్రం కోసం సిద్ధమైపోతున్నారు. ‘రంగస్థలం’ వంటి హిట్‌ తర్వాత సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. రష్మిక కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రీకరణ ప్రారంభమైంది. ఫిబ్రవరి నుంచి బన్ని సెట్స్‌లో అడుగుపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటి నుంచే తన పాత్ర కోసం సిద్ధమవుతున్నారు ఈ స్టైలిష్‌స్టార్‌. శేషాచలం అడవుల్లో జరిగే ఎర్ర చందనం స్మగ్లింగ్‌ కథాంశంతో ఓ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సినిమా ఉండబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆయన పాత్ర చాలా మాస్‌గా ఉండటమే కాక.. తొలిసారి ఆయన చిత్తూరు యాసలో మాట్లాడబోతున్నారు. ఇప్పుడీ యాసలో పట్టు సంపాదించుకునేందుకు అందులో ప్రత్యేక శిక్షణ తీసుకుంటోన్నట్లు తెలుస్తోంది. చిత్రీకరణ మొదలయ్యే నాటికి తన పాత్రకు సంబంధించిన సంభాషణలన్నింటినీ సమర్థవంతంగా యాసలో పలకగలిగేలా ఓ ట్యూటర్‌ను పెట్టుకొని మరీ శిక్షణ తీసుకుంటున్నారట. సినిమాలో ఎక్కువ శాతం అడవుల లోపలే జరుగనుందట. ఇందు కోసం కేరళ, వికారాబాద్‌ అటవీ ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను, ఆ తర్వాత బ్యాంకాక్‌ అడవుల్లో మరికొన్ని సీన్లను తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చబోతున్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.