‘ఏఏ 21’పైనా క్లారిటీ వచ్చేసింది..

ఈ ఏడాది ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు కథానాయకుడు అల్లు అర్జున్‌. ఇప్పుడీ ఉత్సాహంలోనే సుకుమార్‌ దర్శకత్వంలో ఓ బహు భాషా చిత్రం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈరోజు బన్ని పుట్టినరోజును పురస్కరించుకోని దీనికి ‘పుష్ప’ అన్న టైటిల్‌ను ఖరారు చేస్తూ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఇది తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ విడుదల కానుంది. ఈ బర్త్‌డే కానుకగానే బన్ని తర్వాతి చిత్రానికి సంబంధించి ఓ స్పష్టత వచ్చేసింది. ఆయన తన 21వ చిత్రాన్ని దర్శకుడు వేణు శ్రీరామ్‌తో చెయ్యనున్నారు. ‘ఐకాన్‌’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన గతంలోనే వచ్చింది. కానీ. ఆ తర్వాత వేణు.. పవన్‌ కల్యాణ్‌తో ‘వకీల్‌సాబ్‌’ చిత్రాన్ని తెరకెక్కించే బాధ్యతలు అందుకోవడంతో ఈ ప్రాజెక్టు పక్కకు వెళ్లిపోయిందని అంతా భావించారు. కానీ, తాజాగా స్టైలిష్‌స్టార్‌ బర్త్‌డే సందర్భంగా ‘ఐకాన్‌’ బృందం ‘ఏఏ21’ పేరుతో పోస్టర్‌ను విడుదల చేయడంతో దీనిపై ఉన్న ఊహాగానాలన్నీ తొలగిపోయాయి. ఇది కూడా బహు భాషా చిత్రంగా రూపొందనున్నట్లు సమాచారం. ‘వకీల్‌సాబ్‌’ పనులు పూర్తి కాగానే.. వేణు ‘ఐకాన్‌’కు సబంధించిన ప్రీప్రొడక్షన్‌ పనులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఇది సెట్స్‌పైకి వెళ్లనుంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.