‘తుపాకీ 2’ తర్వాత బన్నితో!!

స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌తో మురుగదాస్‌ ఓ సినిమా చెయ్యనున్నారన్న ప్రచారం చిత్ర పరిశ్రమలో ఎప్పటి నుంచో వినిపిస్తూనే ఉంది. ఇప్పటికే వీళ్లిద్దరి మధ్య కథా చర్చలు కూడా జరిగాయి కూడా. ‘అల.. వైకుంఠపురములో’ చిత్ర సమయంలో బన్ని కూడా ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. కానీ, ఆ ప్రాజెక్టు ఎందుకింకా కార్యరూపం దాల్చలేదన్నది స్పష్టతనివ్వలేదు. అయితే తమ కలయికలో సినిమా ఖాయమని.. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ విషయాన్ని తానే స్వయంగా ప్రకటిస్తానని అప్పట్లో బన్ని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడీ ప్రాజెక్టు విషయంలో మళ్లీ కదలిక వస్తోన్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్‌కు సరిపోయే ఓ చక్కటి కథాంశంతో అదిరిపోయే స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నట్లు కోలీవుడ్‌ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఇది పాన్‌ ఇండియా స్థాయిలోనే ఉండనుంది. ప్రస్తుతం మురుగదాస్‌ దర్శకత్వంలో విజయ్‌ దళపతి కథానాయకుడిగా ఓ చిత్రం సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఇది గతంలో వీళ్లిద్దరి కలయికలో వచ్చిన ‘తుపాకీ’కి కొనసాగింపు చిత్రం. ఇది ఆగస్టు నాటికి సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే ‘తుపాకీ 2’ తర్వాత బన్ని చిత్రాన్నే పట్టాలెక్కించాలని లక్ష్యంతో ఉన్నారట మురుగదాస్‌. మరి ఇది ఈసారైనా కార్యరూపం దాల్చుతుందో.. లేదో? వేచి చూడాలి. ప్రస్తుతానికైతే అల్లు అర్జున్‌.. సుకుమార్‌ దర్శకత్వంలో ‘పుష్ప’ చిత్రంతో పాటు వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ‘ఐకాన్‌’ సినిమా చెయ్యాల్సి ఉంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.