అనిల్‌ రావిపూడితో?

అక్కినేని నాగార్జున అనిల్‌ రావిపూడితో చిత్రం చేస్తున్నారా? అవుననే వినిపిస్తుంది ఫిల్మ్‌ నగర్‌ వర్గాల్లో. నాగ్‌ ప్రస్తుతం సాల్మన్‌ దర్శకత్వంలో ‘వైల్డ్‌ డాగ్‌’ చిత్రంలో నటిస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పోలీసు అధికారిగా కనిపించనున్నారు నాగ్‌. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్‌ పునఃప్రారంభమైంది. ఇదిలా ఉండగానే మరో సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. తదుపరి చిత్రం అందరినీ నవ్వించేదిగా ఉండాలని భావించి తగిన ప్రయత్నం మొదలు పెట్టారని టాక్‌. ఈ క్రమంలో అనిల్‌ రావిపూడి ఓ కథని నాగ్‌ కోసం సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. కామెడీ సన్నివేశాల్ని చక్కగా ఆవిష్కరించగల దర్శకుల్లో అనిల్‌ ఒకరు. అందుకే అనిల్‌కి నాగ్‌ పచ్చజండా ఊపే అవకాశాలున్నాయని వినికిడి. ప్రస్తుతం ‘ఎఫ్‌ 3’ చిత్ర స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్నారు అనిల్‌. గతంలో ఆయన తెరకెక్కించిన ‘ఎఫ్‌ 2’ సినిమాకు సీక్వెల్‌గా రూపొందుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తయిన అనంతరం నాగ్‌తో చేసే అవకాశాలున్నాయి.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.