‘పొన్నియన్‌ సెల్వన్’‌ చిత్రంలో సారా అర్జున్‌!

కొంతమంది సినీ నటులు తమ పిల్లలను చిన్నతనం నుంచే సినిమాల్లో నటింపజేస్తూ తమ ముచ్చట తీర్చుకుంటుంటారు. అలా ‘డియర్‌ కామ్రేడ్’‌లో చిత్రంలో రమేష్‌ రావు పాత్రలో నటించి అలరించిన నటుడు రాజ్‌ అర్జున్‌. ప్రస్తుతం తన కూతురు సారా అర్జున్‌ మణిరత్నం ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘పొన్నియన్‌ సెల్వన్‌’‌ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించనుందని సమాచారం. బేబీ సారా తెలుగులో రాజేంద్ర ప్రసాద్‌ కలిసి ‘దాగుడుమూత దండాకోర్‌’ చిత్రంలో బంగారం పాత్రలో నటించి మెప్పించింది. ‘పొన్నియన్‌ సెల్వన్’‌లోని మహిళా ప్రధాన కథానాయిక చిన్ననాటి పాత్రలో సారా అర్జున్‌ నటిస్తోంది. సినిమా మొదటి షెడ్యూల్‌ ఇప్పటికే థాయ్‌లాండ్‌ దేశంలో పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత రెండో షెడ్యూల్‌ని పుదుచ్చేరిలో ఫిబ్రవరి 3 నుంచి చిత్రీకరణ ప్రారంభించారు. ఆరురోజుల పాటు షూటింగ్‌ కూడా జరుపుకొంది. తరువాత లాక్‌డౌన్‌ కారణంగా సినిమా షూటింగ్‌ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా రెండో షెడ్యూల్లో భాగంగా హైదరాబాద్‌లో చిత్రీకరించాలని చిత్రబృందం యోచిస్తుంది. ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా ఎప్పుడు ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం సినిమాని తెరకెక్కించడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా తెరకెక్కుతున్న ‘పొన్నియన్‌ సెల్వన్’‌ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, మద్రాస్‌ టాకీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో జయం రవి, కార్తి, విక్రమ్‌ ప్రభు, ఐశ్వర్యరాయ్‌, త్రిష, శోభ దూలిపాళ్ల, శరత్‌ కుమార్‌, అదితిరావు హైదరి తదితరులు నటిస్తున్నారు. సుహాసిని మణిరత్నం, అలీరాజా సుబకరన్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, ఏ.ఆర్.రెహమాన్‌ సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు.  Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.