అవికాకి అంత స్టామినా ఉందా?
రాజుగారి గ‌ది మూడో భాగం కోసం ఓంకార్ గ‌ట్టిగానే క‌ష్ట‌ప‌డుతున్నాడు. ఈ సినిమా నుంచి త‌మ‌న్నా త‌ప్పుకున్న సంగ‌తి తెలిసిందే. క‌థ విష‌యంలో ఓంకార్‌కీ, త‌మ‌న్నాకీ మ‌ధ్య అభిప్రాయ బేధాలు రావ‌డంతో త‌మ‌న్నా గుడ్ బై చెప్పేసింది. ఆమె స్థానంలో మ‌రో క‌థానాయిక‌ని వెదికిప‌ట్టుకోవ‌డానికి ఓంకార్ చాలా శ్ర‌మించాడు. త‌మన్నా స్టార్ డ‌మ్‌కి త‌గిన క‌థానాయిక కావాల‌ని ఆశ ప‌డ్డాడు. స‌మంత‌, తాప్సి లాంటి వాళ్ల ద‌గ్గ‌ర‌కూ ఈ స్క్రిప్టు వెళ్లింది. అయితే చివ‌రికి అవికాగోర్‌ని ఎంచుకున్నాడు.

ఈ క‌థ‌లోకి అవికా వ‌స్తుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. ఎందుకంటే అవిక ఇది వ‌ర‌కు హార‌ర్ సినిమాలేం చేయ‌లేదు. సినిమా మొత్తాన్ని త‌న భుజాల‌పై వేసుకుని న‌డిపించే ద‌మ్ము కూడా అవికాకు లేదు. త‌మ‌న్నా కోసం డిజైన్ చేసుకున్న క‌థ అవికాకి ఎలా సెట్ అవుతుంద‌న్న‌దే అస‌లు ప్ర‌శ్న‌. రాజుగారి గ‌ది పార్ట్ 1ని కొత్త‌వాళ్ల‌తో తీశాడు ఓంకార్‌. రెండో భాగంలో నాగ్‌, స‌మంత‌ల‌ను తీసుకొచ్చి స్టార్ డ‌మ్ కూడా తోడ‌య్యేలా చేశాడు. మూడో పార్ట్ ఇంకెంత భారీగా ఉండాలి? అందుకే ఈసారి కూడా త‌మ‌న్నా లాంటి స్టార్‌ని ఎంచుకున్నాడు. త‌మ‌న్నా వెళ్లిపోవ‌డంతో ఒక్క‌సారిగా రాజుగారి గ‌ది 3 క‌ళ త‌ప్పిన‌ట్టైంది. ఆస్థానంలో మ‌రో స్టార్ హీరోయిన్ వ‌స్తుంద‌నుకుంటే తెలుగు చిత్ర‌సీమ మ‌ర్చిపోతున్న అవికాని తీసుకొచ్చాడు. మ‌రి అవికా ఈ సినిమాని ఎంత వ‌ర‌కూ మోసుకెళ్తుందో చూడాలి.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.