ఆ అవకాశం అందుకుందా?

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌కు టాలీవుడ్‌లో మంచి గుర్తింపు ఉంది. గతంలో ఈ కలయికలో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్‌’ చిత్రాలు బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించాయి. తాజాగా ఈ కాంబోలో మరో చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రెండు విభిన్న పాత్రలు పోషిస్తున్నారు బాలయ్య. ఇందుకు ఇద్దరు నాయికలకు అవకాశం ఉందని తెలుస్తోంది. సీనియర్‌ నాయిక పాత్ర కోసం ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నా ఎవరూ ఖరారు కాలేదు. ఈ క్రమంలో బాలీవుడ్‌ భామలు పేర్లు వినిపించాయి. టాలీవుడ్‌ అగ్ర నాయికలు నటిస్తున్నారంటూ ప్రచారం సాగింది. చిత్ర బృందం నుంచి ప్రకటన రాకపోవడంతో అవన్నీ ఊహాగానాలుగానే మిగిలాయి. ఇప్పుడు సీనియర్‌ నాయిక స్నేహ ఈ ప్రాజెక్టులో అడుగుపెట్టబోతుందని మరోసారి తెరపైకి వచ్చింది. బాలయ్య సరసన నటింపజేసేందుకు స్నేహను ఎంపిక చేద్దామనుకుంటున్నారట బోయపాటి. రామ్‌ చరణ్‌ కథానాయకుడుగా ఆయన తెరకెక్కించిన ‘వినయ విధేమ రామ’ సినిమాలో కీలక పాత్రలో నటించింది స్నేహ. ఆమె నటన ఆకట్టుకోవడంతో మరోసారి అవకాశం ఇవ్వనున్నారని వినికిడి. అంతేకాదు ‘పాండురంగడు’ చిత్రంతో బాలయ్య, స్నేహ జంట అలరించింది. మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. టైటిల్‌ ఇంకా ప్రకటించలేదు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.