
దేవరాజ్ కథానాయకుడిగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘బుల్లెట్ సత్యం’. సోనాక్షి వర్మ కథా నాయిక. మధు గోపు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పేరుని, లిరికల్ వీడియో గీతాన్ని బుధవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. నిర్మాతలు రాజ్ కందుకూరి, సంజయ్‌రెడ్డి, దర్శకులు వీరశంకర్, దేవి ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ‘‘గ్రామీణ నేపథ్యంలో సాగే చిత్రమిది. వాస్తవికతకి పెద్దపీట వేస్తూ తెరకెక్కించాం. బుల్లెట్ సత్యం పాత్ర, ఆయన కథ ప్రేక్షకుల్ని అలరిస్తుంది.’’ అన్నారు. కథానాయకుడు, నిర్మాత మాట్లాడుతూ ‘‘కొత్త రకమైన కథ ఇది. నేను తొలిసారి కథానాయకుడిగా నటించా’’ అన్నారు. వీరశంకర్ మాట్లాడుతూ ‘‘దేవరాజ్ కరోనా సమయంలో ముందుకొచ్చి ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇలాంటివాళ్లు చిత్ర పరిశ్రమకి అవసరం. రాంబాబు గోసాల సాహిత్యం బాగుంది’’ అన్నారు. ‘‘జార్జ్రెడ్డిలోని బుల్లెట్ పాట ఎంతగా ఆదరణ పొందిందో, ఈ చిత్రం కూడా అంతటి విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు సంజయ్‌రెడ్డి. ఇందులోని అన్ని పాటల్నీ రాశానన్నారు రాంబాబు గోసాల. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు వినోద్ యాజమాన్య, నృత్య దర్శకుడు చంద్రకిరణ్ తదితరులు పాల్గొన్నారు.