‘బన్నీ 19 - 21’ల్లో.. ఎన్ని సర్‌ప్రైజ్‌లో!!

‘జులాయి’, సన్నాఫ్‌ సత్యమూర్తి’ వంటి హిట్ల తర్వాత అల్లు అర్జున్‌ - త్రివిక్రమ్‌ల కలయికలో వస్తున్న మూడో చిత్రం తాజాగా పూజా కార్యక్రమాలతో మొదలైన సంగతి తెలిసిందే. ఈనెల 24 నుంచి రెగ్యులర్‌ షూట్‌ ప్రారంభం కానుంది. తండ్రీ కొడుకుల అనుబంధాల నేపథ్యంతో ఈ సినిమా రూపొందనున్నట్లు సమాచారం. ఇప్పుడీ చిత్రం కోసం తారాగణం రూపంలో మరిన్ని కొత్త హంగులు అద్దబోతున్నాడట మాటల మాంత్రికుడు. ఈ మూవీలో బన్నీకి జోడీగా పూజా హెగ్డే నటించనుండగా.. సునీల్, రావు రమేష్, రాజేంద్రప్రసాద్, టబు, రాహుల్‌ రామకృష్ణ తదితరులు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ జాబితాలోకి మరో ఇద్దరు కుర్రహీరోలను కూడా తీసుకొచ్చారు త్రివిక్రమ్‌. వారు మరెవరో కాదు.. అక్కినేని సుశాంత్, నవదీప్‌. సుశాంత్‌ ఇప్పటి వరకు కథానాయకుడిగానే అలరించారు కానీ, సహాయ నటుడిగా కనిపించింది లేదు. కానీ, ఇప్పుడీ ప్రతిష్ఠాత్మక మూవీలో ‘పప్పు’ అనే పాత్రను పోషించబోతున్నాడు ఈ అక్కినేని హీరో. సినిమాలో ఈ పాత్రకు ఎంతో ప్రాధాన్యముందట. నవదీప్‌ పాత్ర కూడా దాదాపు ఇదే తరహాలో ఉండనున్నట్లు సమాచారం.


* ఐకాన్‌ డబుల్‌ ధమాకా.
.
త్రివిక్రమ్, సుకుమార్‌ల తర్వాత బన్నీ తన 21వ చిత్రాన్ని వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. దీనికి ‘ఐకాన్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ ఆసక్తికర అంశం బయటకొచ్చింది. ఈ సినిమా కోసం అల్లు అర్జున్‌ తొలిసారిగా ద్విపాత్రాబినయం చేయబోతున్నాడట. అంతేకాదు ఓ పాత్రలో బన్నీకి జోడీగా బాలీవుడ్‌ హీరోయిన్‌ను తీసుకోనున్నారట. మరి ఈ వార్తల్లో వాస్తవమెంతన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మించనున్నాడు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.