మరోసారి రెండక్షరాలతో?

‘ఆర్య’, ‘బన్ని’, ‘హ్యాపీ’, ‘వేదం’, ‘ఆర్య 2’, ‘డీజే’.. ఇవి అల్లు అర్జున్‌ నటించిన రెండక్షరాలున్న సినిమాలు. ‘ఆర్య’, ‘ఆర్య 2’ చిత్రాలు దర్శకుడు సుకుమార్, బన్నీ కాంబినేషన్‌లో వచ్చాయి. ఇప్పుడు మరోసారి రెండు అక్షరాల పేరు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. స్మగ్లింగ్‌ నేపథ్యంలో అర్జున్‌ హీరోగా సుకుమార్‌ ఓ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కువగా అడవుల్లో సాగే చిత్రం కావడంతో ‘శేషాచలం’ అనే టైటిల్‌ ప్రచారం ఉంది ఇప్పటి వరకు. అయితే ప్రస్తుతం కొత్త పేరును తీసుకునే ఆలోచనలో ఉందట చిత్ర బృందం. అది అమ్మాయి పేరు కావచ్చని టాలీవుడ్‌ వర్గాల సమాచారం. బన్నీ పుట్టిన రోజు కానుకగా ఏప్రిల్‌ 8న టైటిల్, ఫస్ట్‌లుక్‌ విడుదల చేసే అవకాశాలున్నాయి. బన్నీ సరసన రష్మిక నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.