చిరిగిన దుస్తులతోనే సురేఖకు తాళి కట్టా

తెలుగు చిత్రసీమలోని ముచ్చటైన ఆదర్శ దంపుతుల్లో చిరంజీవి - సురేఖ ఒకరు. వాళ్లిద్దరిదీ పెద్దలు కుదిర్చిన వివాహమే అయినప్పటికీ ఆ జంట ప్రేమ పక్షుల్లోనూ కనిపించనంత చక్కటి అనుబంధం ఉంటుంది. ఇప్పటి వరకు చిరు - సురేఖల జంట ఏదైనా సినీ వేడుకల్లో దర్శనమివ్వడమే తప్ప ప్రత్యేకంగా ఓ ఇంటర్వ్యూ కోసం మీడియా ముందుకొచ్చింది లేదు. కానీ.. తాజాగా చిరు తన ప్రియ సతీమణితో కలిసి తొలిసారి ఓ ముఖాముఖీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ పెళ్లి నాటి కబుర్లను పంచుకుంటూ చిరు కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘‘నిజానికి సురేఖతో పెళ్లి ప్రస్తావన సమయంలో ఆమెను నాకివ్వాలా? లేదా? అని అల్లూరి రామలింగయ్యగారు ఓ పది మంది నిర్మాతల దగ్గర నా గురించి ఎంక్వైరీ చేశారు. నిజానికి అప్పటికి నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. నాదింకా పెళ్లి వయసు కాదని వాళ్లకు తేల్చి చెప్పేశా కూడా. కానీ, మా వాళ్లు నేను వేరే ఆకర్షణలకేమైనా లోనవుతానేమోననే భయంతో బలవంతంగా నన్ను పెళ్లి చూపులకు ఒప్పించి తీసుకెళ్లారు. మా పెళ్లి కుదిరాక కూడా సురేఖతో నేను పెద్దగా మాట్లాడింది లేదు. ఇక పెళ్లి విషయంలోనూ కాస్త హడావుడే జరిగింది. ఆ సమయానికి నేను ‘తాతయ్య ప్రేమ లీలలు’ అనే సినిమా చేస్తున్నా. అందులో నూతన్‌ ప్రసాద్‌కు నాకు కొన్ని కీలక సీన్లు ఉన్నాయి. అప్పటికి ఆయన ఫుల్ బిజీ ఆర్టిస్టు కావడంతో ఆయన డేట్స్‌ కోసం పెళ్లి వాయిదా వేసుకోవల్సి వస్తుందేమోని అనుకున్నాం. కానీ, ఎలాగోలా షూట్‌ను నిర్మాత వాయిదా వేసి మా పెళ్లికి గ్యాప్‌ ఇచ్చారు. ఇక పెళ్లి పీటల మీద కూర్చొనేటప్పటికి నా చొక్కా చిరిగిపోయింది. అది చూసి సురేఖ వెళ్లి బట్టలు మార్చుకోవచ్చుగా అని అడిగింది. ‘‘ఏం.. బట్టలు చిరిగితే తాళి కట్టలేనా’ అని, అలాగే కట్టేశాను. అయితే అప్పటికే నాకు ఏడెనిమిది పెళ్లిళ్లు చేసుకున్న అనుభవం ఉంది (సినిమాల్లోనే లేండి)’’ అని ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు చిరు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.