మోహన్‌బాబు కోరికకు అడ్డు చెప్పిన చిరు!!

కరోనా కారణంగా వినోదానికి దూరమైన సినీప్రియులకు.. ట్విటర్‌ వేదికగా పసందైన వినోదాన్ని అందిస్తున్నారు చిరంజీవి. ఆయన ఇటీవలే ఉగాది పర్వదినాన ట్విటర్‌లో ఖాతా తెరిచిన సంగతి తెలిసిందే. ఆయనీ సామాజిక మాధ్యమంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి తన పోస్ట్‌లు, కామెంట్లతో నెటిజన్లలో కావల్సినంత జోష్‌ను నింపుతున్నారు. ముఖ్యంగా ఆయన ట్విటర్‌ గూటిలో అడుగుపెట్టినప్పటి నుంచి కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబుకి తనకీ మధ్య నడుస్తున్న సందేశాలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. చిరు ట్విటర్‌లో కాలుమోపిన రోజే.. కలెక్షన్‌ కింగ్‌ ‘‘మిత్రమా స్వాగతం’’ అంటూ ఆయనకు స్వాగతం పలికారు. దీనికి మెగాస్టార్‌ తనదైన శైలిలో బదులిస్తూ.. ‘‘రాననుకున్నావా.. రాలేననుకున్నావా’’ అంటూ సరదాగా ట్వీట్‌ ద్వారా బదులిచ్చారు. అయితే దీనికి మోహన్‌బాబు జవాబిస్తూ.. ‘‘ఈసారి హగ్‌ చేసుకున్నప్పుడు చెపుతాను’’ అని ట్వీటారు. అయితే అక్కడితో ఆగిపోయిందనుకున్న ఈ మిత్రులిద్దరి ట్విటర్‌ సంభాషణ.. ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. ‘‘ఈసారి హగ్‌ చేసుకున్నప్పుడు...’’ అన్న మోహన్‌బాబుకు మాటకు తాజాగా చిరు సందర్భోచితంగా స్పందిస్తూ ‘‘మిత్రమా.. కరోనా రక్కసి కోరలు చాస్తున్న ఈ తరుణంలో, మనలో మార్పు రావాలి. నో హగ్స్, నో షేక్‌హ్యాండ్స్‌.. ఓన్లీ నమస్తే. సామాజిక దూరాన్ని కచ్చితంగా పాటిద్దాం. మనకు దగ్గర వాళ్లని, కావల్సిన వాళ్లని జాగ్రత్తగా కాపాడుకుందాం’’ అని తనదైన శైలిలో బదులిచ్చారు. అయితే చిరు ఇచ్చిన జవాబుకు మోహన్‌బాబు తనదైన స్టైల్‌లో తిరిగి బదులిస్తూ.. ‘‘మిత్రమా.. మహమ్మారి తాత్కాలికం. మన స్నేహం శాశ్వతం’’ అని ట్వీట్‌ చేయడం అందరి మనసుల్ని దోచుకుంది. మొత్తానికి నెట్టింట వీళ్లిద్దరి స్నేహ బంధాన్ని చూసి సినీప్రియులంతా తెగ మురిసిపోతున్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.