ఆ ‘డ్రైవింగ్‌ లైసెన్స్‌’.. చరణ్‌ది కాదట!!

రా
మ్‌చరణ్‌ ఓవైపు కథానాయకుడిగా బిజీగా గడిపేస్తూనే.. తన తండ్రి కోసం నిర్మాతగానూ పనిచేస్తున్నారు. చిరు సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి ఆయన కోసం కథలు సిద్ధం చేయించడం.. ఆ కథలకు తగ్గ దర్శకుల్ని వెతికి పట్టుకురావడం అన్నీ ఆయనే దగ్గరుండి చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన నిర్మాణంలోనే కొరటాల శివ - చిరంజీవిల కొత్త చిత్రం ముస్తాబవుతోన్న సంగతి తెలిసిందే. ఇది పూర్తయిన వెంటనే తన తండ్రి కోసం చరణ్‌ ఇప్పటికే ఓ కథ కూడా వెతికి పెట్టేసుకున్నారు. అదే ‘లూసిఫర్‌’ రీమేక్‌. అయితే ఇటీవలే ఆయన ‘డ్రైవింగ్‌ లైసెన్స్‌’ అనే మరో మలయాళ చిత్ర రీమేక్‌ హక్కులు కొన్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఇది తన బ్యానర్‌లోనే మరో బయట హీరోతో చేయించబోతున్నట్లు గుసగుసలు వినిపించాయి. కానీ, తాజాగా చరణ్‌ సన్నిహిత వర్గాల నుంచి అందుతోన్న సమాచారం ప్రకారం.. ఆయన ‘డ్రైవింగ్‌ లైసెన్స్‌’ హక్కులు కొనలేదని తెలుస్తోంది. ప్రస్తుతం చరణ్‌ నటుడిగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో.. నిర్మాతగా చిరు 152వ సినిమాతో తీరిక లేకుండా ఉన్నారని కాబట్టి ముందు ఆయన దృష్టంతా వీటిని పూర్తి చేయడం పైనే ఉందని సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే ఇప్పుడా చిత్ర రీమేక్‌ హక్కులను ఎవరు దక్కించుకుంటారనేది ఆసక్తికరంగా మారుతుంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.