రూటు మార్చిన రజనీ?

దశాబ్దాల తరబడి భారతీయ చిత్ర పరిశ్రమలో రికార్డులు నెలకొల్పుతున్న కథానాయకుడు రజనీకాంత్‌. ఇండియాలో మొదటి సారి వంద కోట్లు వసూళ్లు చేసిన చిత్రానికి దర్శకుడు మురుగదాస్‌. వీళ్ళిద్దరి కలయికలో చిత్రం వస్తే అది పాన్‌ ఇండియా మూవీ అవుతుందని అభిమానులు ఆశిస్తారు. అందుకు తగ్గట్టే ‘దర్బార్‌’ మోషన్‌ పోస్టర్‌ని అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల చేస్తే మిలిమన్స్‌ వీక్షణలతో అంతర్జాలంలో సందడి చేస్తోంది. ‘దర్బార్‌’ను 2020 సంక్రాతి కానుకగా జనవరి 15న విడుదల చేస్తారని చాలా కాలం ముందే ప్రకటించారు. ఇప్పుడు రజనీ రూటు మార్చారని సమాచారం. ‘దర్బార్‌’ను జనవరి 9నే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారట దర్శకనిర్మాతలు. ‘దర్బార్‌’ పాన్‌ ఇండియా మూవీ కాబట్టి జనవరి 15న విడుదల చేస్తే అంతుకు ముందు విడుదలయ్యే పెద్ద ప్రాంతీయ చిత్రాలు చాలా మటుకు థియేటర్లను ఆక్రమిచేస్తాయి. తెలుగులో మహేష్‌ ‘సరిలేరు నీకెవ్వరు’, బన్ని ‘అల..వైకుంఠపురములో’, హిందీలో అజయ్‌ దేవగణ్‌ ‘తన్హాజీ’ వలన ‘దర్బార్‌’కి థియేటర్ల సమస్య ఏర్పడుతుందని భావిస్తున్నారు. అందుకే వీటి కన్నా ముందే ‘దర్బార్‌’ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తే ఎక్కువ వసూళ్లు సాధించే అవకాశం ఉందని నిర్మాతల అభిప్రాయం. అంతేకాకుండా జనవరి 9నే అయితే మరికొన్ని సెలవులు కూడా కలసోస్తాయనే ఆలోచనలో ఉన్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. రజనీ రూటు మార్చితే మరికొన్ని సినిమాల విడుదల తేదీలలో మార్పులు జరిగే అవకాశం ఉంటుందని సినీ జనాలు అంటున్నారు. ‘దర్బార్‌’ ప్రభావం ఏ సినిమాలపై ఉంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడాలి. రజనీ జన్మదినం డిసెంబర్‌ 12 సందర్భంగా ఈ చిత్ర గీతావిష్కరణ వేడుక నిర్వహించాలని నిర్మాతలు అనుకుంటున్నారు. ఒక వేళ ఆ రోజు వీలు పడకపోతే డిసెంబర్‌ 7నే గీతావిష్కరణ చేసి 12న ప్రచారచిత్రాన్ని విడుదల చేస్తారు. దీనికి అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీత స్వరకర్త.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.