
వైవిధ్య దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘లెప్టినెంట్ రామ్’. దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మితమౌతోంది. అయితే ఇప్పటి వరకు ఈ చిత్రంలో కథానాయికలు ఎవరనే విషయం తెలియదు. తాజాగా ఇందులో హీరోయిన్లుగా పూజాహెగ్డే, రష్మిక మండన్నలు నటించనున్నారని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే చిత్ర కథను ఇద్దరి భామలకు హను వినిపించాడట. అందుకు వాళ్లు ఓకే కూడా చెప్పారట. ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ హోదాలో పనిచేస్తున్న రామ్ అనే యువకుడి ప్రేమకథగా దీనిని రూపొందిస్తున్నారు. ఆ మధ్య దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ని ఆవిష్కరించింది. పోస్టర్లో దుల్కర్ సల్మాన్ భుజంపై తుపాకితో ఉన్నారు. చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీత స్వరాలు అందిస్తున్నారు. ప్రియాంక దత్ నిర్మాత. సినిమా తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ప్రస్తుతం పూజాహెగ్డే వివిధ తెలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. మరో కథానాయిక రష్మిక మండన్న సైతం తెలుగు, తమిళం, కన్నడ చిత్రాల్లో నటిస్తూ సందడి చేస్తుంది. ఇలాంటి టాప్ నాయికలు ‘లెప్టినెంట్ రామ్’లో ఎలాంటి సందడి చేస్తారో తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.