కోమలి’ ఏం చెప్పబోతుంది?

యువ కథానాయికలకు దీటుగా వరుస అవకాశాలతో తీరిక లేకుండా గడిపేస్తోంది కాజల్‌ అగర్వాల్‌. ప్రస్తుతం ఈ చందమామ నుంచి ‘సీత’, ‘ప్యారిస్‌ ప్యారిస్‌’ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇక తాజాగా ‘కోమలి’ అనే మరో వైవిధ్యభరిత చిత్రంతో సెట్స్‌పై బిజీగా గడిపేస్తోంది. జయం రవి కథానాయకుడిగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని నూతన తమిళ దర్శకుడు ప్రదీప్‌ రంగనాథన్‌ తెరకెక్కిస్తున్నారు. హిప్‌హాప్‌ స్వరాలు సమకూరుస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో రవి చేతికి సెలైన్‌తో, పేషెంట్‌ గెటప్‌లో అయోమయానికి గురవుతున్నట్లుగా ముఖం పెట్టి ఆసక్తికరంగా కనిపించాడు. బ్యాగ్రౌండ్‌లో సామాజిక మాధ్యమాలకు సంబంధించిన లోగోలు ఉన్నాయి. దీన్ని బట్టీ చూస్తుంటే సోషల్‌ మీడియాపై ఓ సెటైరికల్‌ మూవీగా దీన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. ఇక పైన టైటిల్‌ లోగోలో 1990 నుంచి 2016 వరకు కొన్ని సంవత్సరాలను పొందుపరచడం.. వాటికి కథకు సంబంధం ఏంటన్న ఆసక్తిని కలిగిస్తోంది. వేల్స్‌ ఫిలిమ్స్‌ ఇంçర్నేషనల్‌ బ్యానర్‌పై దీన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రం ద్వితియార్థంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.