గుడ్డిగా ఒప్పుకున్నా..రం
గుల ప్రపంచంలో కథానాయకులతో పోల్చితే నాయికల సినీ ప్రయాణం చాలా త్వరగా ముగిసిపోతుంటుంది. ముఖ్యంగా కొత్త అందాలను ఆస్వాదించడానికి ఉవ్విళ్లూరే తెలుగు సినీప్రియుల మదిలో ఏళ్లకు ఏళ్లు కలల రాణిగా కీర్తిని దక్కించుకోవాలంటే అందం.. అభినయాలతో పాటు మరి కాస్త అదృష్టమూ తోడవ్వాలి. ఇవన్నీ పుష్కలంగా ఉన్నాయి కాబట్టే దశాబ్దంన్నర దాటుతున్నా తెలుగు తెరపై తన అందచందాలతో అభినయాల వెన్నెలలు కురిపిస్తూనే ఉంది కాజల్‌. ‘మరి ఇన్నేళ్ల సినీ ప్రయాణాన్ని వెనక్కు తిరిగి చూసుకుంటే.. తప్పని తెలిసీ తీసుకున్న నిర్ణయాలేమైనా కనిపిస్తాయా?’ అని అడిగితే.. చాలా ఉన్నాయని బదులిచ్చింది ఈ చందమామ. ‘‘వెండితెరపై రాణించాలని కలలుగనే ప్రతి కథానాయిక విషయంలోనూ ఇది జరుగుతూనే ఉంటుంది. మనకంటూ ఓ ఇమేజ్‌ లేని సమయంలో ఓ దర్శక నిర్మాత ముందుకొచ్చి మనకు అవకాశమివ్వడమే గొప్ప విషయం. ఆ సమయంలో మన సొంత నిర్ణయాలకు చోటుండదు. ముఖ్యంగా స్టార్‌ కథానాయకులు, దర్శకులతో చేసే అవకాశమొచ్చినప్పుడు.. కథేంటి? నా పాత్ర పరిధి ఎంత? పారితోషికమెంత? వంటి ప్రశ్నలు అసలు అడగలేం. ధైర్యం చేసి అడిగే ప్రయత్నం చేశామంటే వచ్చిన అవకాశాన్ని చేజేతులా పోగొట్టకున్న వాళ్లమౌతాం. అందుకే చాలా సార్లు గుడ్డిగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కానీ, నా అదృష్టవశాత్తూ నేనలా ఒప్పుకున్న చిత్రాలేవీ నన్ను పెద్దగా నిరాశపరచలేదు. కొన్ని అనూహ్య విజయాలు అందుకొని నా కెరీర్‌కు గొప్ప ఊపునిచ్చాయి. ఒకటి రెండు చిత్ర ఫలితాల విషయంలో కాస్త నిరాశకు గురైనా అవి నాకు గొప్ప పాఠాల్ని నేర్పాయి కదా అని సంతృప్తి పడ్డా’’ అని చెప్పుకొచ్చింది కాజల్‌. ప్రస్తుతం ఆమె చిరంజీవి సరసన ‘ఆచార్య’ చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతోంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.