మరో తమిళ చిత్రంలో ప్రతినాయకుడిగా కార్తికేయ?

తెలుగులో ‘ఆర్‌ ఎక్స్ 100’ సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు కార్తికేయ గుమ్మకొండ. ఆ తరువాత ‘హిప్పీ’, ‘90ఎంఎల్’‌ లాంటి చిత్రాల్లో నటించి అలరించారు. ఇక కార్తికేయ తెలుగులోనూ హీరో పాత్రలతో పాటు ప్రతినాయకుడి పాత్రలోనూ నటించారు. నాని నటించిన ‘గ్యాంగ్‌లీడర్‌’ చిత్రంలో విలన్‌ దేవ్‌గా నటించి మెప్పించారు. ప్రస్తుతం తమిళంలో ‘సింగం’ సీక్వెల్‌ చిత్రాలను తెరకిక్కించిన హరి దర్శకత్వంలో అరుణ్‌ విజయ్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కార్తికేయను అడిగారని చెప్పుకుంటున్నారు. కార్తికేయ ఇప్పటికే అజిత్‌ సినిమా ‘వాలిమై’లో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుపుకుంది. మరోవైపు తెలుగులో కార్తికేయ ‘చావు కబురు చల్లగా’ అనే చిత్రం చేస్తున్నారు. కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి అల్లు అరవింద్‌ సమర్పకుడిగా వ్యవహరిస్తుండగా బన్నీ వ్యాస్‌ నిర్మిస్తున్నారు. ఇందులో కార్తికేయ బస్తీ బాలరాజు పాత్రలో కనిపించనున్నాడు.  ఇప్పటికే సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుదలై ఆకట్టుకుంటోంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.