‘కేజీఎఫ్2’ టీజర్‌ వచ్చేది అప్పుడేనా!

యష్‌, సంజయ్‌దత్‌ కలిసి నటిస్తున్న చిత్రం ‘కె.జి.ఎఫ్‌: చాప్టర్‌ 2’. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్‌ ఇండియా సినిమా టీజర్‌ని కథానాయకుడు యష్‌ పుట్టినరోజున విడుదల చేయాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తుందట. ఆ విధంగా చూస్తే వచ్చే ఏడాది జనవరి 8న టీజర్‌ విడుదల కానుందన్న మాట. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరాగండూర్ నిర్మిస్తున్నారు. ఇందులో సంజయ్‌ దత్‌ అధీరా పాత్రలో నటిస్తుండగా, రవీనా టాండన్‌ ప్రధానమంత్రి రమికా సేన్‌ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే అధీరా, రమికా సేన్‌ల పాత్రల ఫస్ట్ లుక్స్ విడుదలై చిత్రంపై అంచనాలు పెంచేశాయి. ఆ మధ్య చిత్రం గురించి రాకీ భాయ్‌ అదే హీరో యష్‌ మాట్లాడుతూ..‘‘కేజీఎఫ్‌2 భారీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి చిత్రం కంటే ఇది ఐదు రెట్లు ఉత్సాహాన్ని అందిస్తుందని’’ చెప్పారు. కోవిడ్‌-19 మహమ్మారి లేకుంటే ఈ పాటికే వెండితెరపై అలరించేది. ప్రస్తుతం సినిమా చివరి షెడ్యూల్‌ని శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. డిసెంబర్‌ మధ్యనాటికి చిత్రీకరణ పూర్తి చేసుకోనుందని వార్తలు వస్తున్నాయి. చిత్రాన్ని వచ్చే యేడాది వేసవి నాటికి తెరపైకి తీసుకురానున్నారు. ఇందులో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది. రావు రమేష్‌, వశిష్ట సింహా, అచ్యుత్‌ కుమార్‌, మాలవిక అవినాష్‌, టీఎస్‌ నాగభరణ తదితరులు నటిస్తున్నారు. ర‌వి బ‌స్రూర్ సంగీతం, భువ‌న్ గౌడ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. సినిమాని ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు. కన్నడలోని కెఆర్జి స్టూడియోస్, హిందీలో ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్, ఎఎ ఫిల్మ్స్, తమిళంలోని విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ , తెలుగులో వారాహి చలన చిత్రం సంస్థలు పంపిణీదారులుగా వ్యవహరిస్తున్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.