అప్పుడు ఆపేశారు.. ఇప్పుడు చేయబోతున్నారు??

తొలి చిత్రం ‘మిర్చి’ తర్వాత చెర్రీతో ఓ చిత్రం ప్రకటించి అభిమానుల్లో అంచనాలు పెంచారు కొరటాల శివ. అయితే ఎన్ని వెర్షన్లు మార్చినా స్క్రిప్టు విషయంలో స్పష్టత రాకపోవడంతో ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన ఇష్టపడలేదు . కథపై పూర్తి నమ్మకం ఏర్పడ్డాకే చేద్దాం అని భరోసా ఇచ్చాడు రామ్‌ చరణ్‌. అలా ప్రకటించిన చిత్రం సెట్స్‌పైకి వెళ్లకుండానే ఆగిపోయింది. ఎప్పటికైనా ఈ కాంబినేషన్‌లో సినిమా వస్తుందని ఆశగా ఉన్నారు సినీ ప్రియులు. ఆ సర్‌ప్రైజ్‌కి సమయం ఆసన్నమైందని తాజా సమాచారం. లాక్‌డౌన్‌ విరామ సమయాన్ని దర్శకులందరూ కథలు రాసేందుకు వినియోగించారు. కొరటాల సైతం పలు విభిన్న స్ర్కిప్టులు రాసుకున్నారని తెలుస్తుంది. ఇప్పటికే ఆయన అల్లు అర్జున్‌ కథానాయకుడుగా ఓ సినిమా ప్రకటించారు. ఆ చిత్రం తర్వాత చెర్రీతో చేసేందుకు ఆసక్తి చూపుతున్నారట. కొరటాల శివ సన్నిహితులు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని వినికిడి.అప్పటి కథకే మార్పులు చేశారా? కొత్త కథా? అంటే చిత్ర బృందం వెల్లడించాల్సిందే.చిరంజీవి హీరోగా కొరటాల తెరకెక్కిస్తున్న ‘ఆచార్య’ సినిమాకు రామ్‌ చరణే నిర్మాత. మరి ఈ క్రేజీ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలంటే కొంతకాలం ఆగాల్సిందే. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంతో బిజీగా ఉన్న చెర్రీ ఇప్పటి వరకు తదుపరి చిత్రం వెల్లడించలేదు. పలువురి దర్శకుల పేర్లు వినిపించినా స్పష్టత లేదు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.