‘లవ్‌స్టోరీ’ టీజర్‌ ఆరోజు విడుదల చేస్తారా!

నాగచైతన్య హీరోగా నటిస్తున్న రొమాంటిక్ చిత్రం ‘లవ్‌స్టోరీ`. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయిపల్లవి కథానాయికగా నటిస్తోంది. కరోనా వైరస్ ముందే సినిమా చిత్రీకరణ చాలా వరకు పూర్తి చేసుకుంది. తాజాగా లాక్‌డౌన్ నిబంధనల ప్రకారం ఈ నెల 7న చిత్రబృందం షూటింగ్ మళ్లీ ప్రారంభించింది. సినిమా షూటింగ్‌ని పదిహేను రోజుల్లో ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేయాలని చిత్రబృందం అనుకుంటోంది. తాజాగా సినిమాకి సంబంధించిన ఓ అందమైన బహుమతిని ప్రేక్షకులకు ఇచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారట.  విషయం ఏమిటంటే ఈ నెల 20 అక్కినేని నాగేశ్వరరావు జయంతి. ఈ సందర్భంగా మనవడి ‘లవ్‌స్టోరి’ చిత్రానికి సంబంధించిన పాట లేదా టీజర్ విడుదల చేయాలని చిత్రబృదం భావిస్తుందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. దర్శకుడు శేఖర్‌ కమ్ముల మాత్రం చిత్రాన్ని సాధ్యమైనంత వరకు త్వరగా పూర్తి చేసి, ఈ ఏడాది చివర్లోపు చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందు కసరత్తులు చేస్తున్నారట. చైతన్య ‘లవ్‌స్టోరీ’ టీజర్ - పాట ఏది బయటకు వస్తుందో తెలియాలంటే అక్కినేని జయంతి వరకు ఆగాల్సిందే మరి! శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ పతాకంపై నారాయణ్‌ దాస్‌ కె.నారంగ్, పి.రామ్మోహన్‌రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమాకి సంబంధించిన ‘ఏయ్‌ పిల్లా... పరుగున పోదామా’ అంటూ సాగే ఈ చిత్రంలోని లిరికల్‌ వీడియో గీతాన్ని విడుదల చేసింది. చిత్రంలో రాజీవ్‌ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని తదితరులు నటిస్తున్నారు. 



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.