‘లూసిఫర్‌’కి సుక్కు కాదు.. ఆయనట!!

ప్రస్తుతం చిరంజీవి కథల ఎంపికలో దూకుడు చూపిస్తున్నారు. కొన్నాళ్ల కిత్రం వరకు ఒకటి తర్వాత ఒకటన్నట్లుగా సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరించిన ఆయన.. ఇప్పుడొకటి సెట్స్‌పై ఉండగానే మరో స్క్రిప్ట్‌ను లాక్‌ చేసి పెట్టుకుంటున్నారు. ఇప్పుడాయన కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతుండగానే.. దాని తర్వాతి చిత్రానికి రంగం సిద్ధం చేసేసుకుంటున్నారు. ఇప్పటికే చిరు కోసం రామ్‌చరణ్‌ ‘లూసిఫర్‌’ రీమేక్‌ హక్కులను కొని ఉంచిన నేపథ్యంలో ఆయన 153వ చిత్రం ఇదేనని ఇప్పటికే తెలిసింది. ఈ రీమేక్‌ను క్రియేటీవ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ తెరకెక్కించబోతున్నట్లు నిన్నమొన్నటి వరకు వార్తలు వినిపించాయి. కానీ, తాజాగా ఈ రీమేక్‌కు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ క్లాసిక్‌ రీమేక్‌ను తెరకెక్కించే బాధ్యతను చరణ్‌ సుక్కు నుంచి మరో దర్శకుడికి అప్పజెప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆయన మరెవరో కాదు.. ‘గీత గోవిందం’తో సినీప్రియుల దృష్టిని ఆకర్షించిన దర్శకుడు పరశురాం. ఇప్పుడీయనే తెలుగు ‘లూసిఫర్‌’ బాధ్యతలను భజానికెత్తుకోబోతున్నట్లు సమాచారం అందుతోంది. అయితే సుక్కునే ఈ రీమేక్‌కు నో చెప్పారా? లేక చరణ్‌ ఆయన్ని వద్దనుకున్నారా? అన్నది కచ్చితంగా తెలియరాలేదు. కానీ, ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడానికి మరింత సమయం పట్టే అవకాశముంది. ప్రస్తుతానికి పరశురాం.. నాగచైతన్యతో కలిసి ‘నాగేశ్వర్రావు’ అనే చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. దీన్ని ఈ ఏడాదిలోనే పూర్తి చెయ్యనున్నాడట ఈ యువ దర్శకుడు. ఈలోపు చిరు కూడా కొరటాల చిత్రాన్ని పూర్తి చేసుకోని బయటకొస్తే.. వచ్చే ఏడాది ప్రధమార్థంలో ‘లూసీఫర్‌’ రీమేక్‌ను పట్టాలెక్కించనున్నాడని తెలుస్తోంది. మరి ఇందులో వాస్తవమెంతన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడక తప్పదు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.