మరింతగా పెరగనున్న ‘మహర్షి’ నిడివి!!

‘‘ఏలేద్దాం అనుకుంటున్నా సర్‌.. ప్రపంచాన్ని ఏలేద్దాం అనుకుంటున్నా’’ అంటూ థియేటర్లలోకి దూసుకొచ్చిన ‘మహర్షి’.. ఇప్పుడు బాక్సాఫీస్‌ను ఏలేస్తోంది. తాజాగా ఈ చిత్రం వంద కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. మహేష్‌ బాబు - పూజా హెగ్డే జంటగా నటించిన ఈ సందేశాత్మక చిత్రం నాలుగు రోజుల్లోనే ఈ మార్కును అందుకోవడం విశేషం. మహేష్‌ కెరీర్‌లో 25వ చిత్రం కావడంతో దర్శకుడు వంశీపైడిపల్లి దీన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించారు. ప్రస్తుతం ఈ సినిమాకు బాక్సాఫీస్‌ వద్ద మంచి ఆదరణ లభిస్తుండటంతో చిత్ర బృందం ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. అది మరేంటో కాదు.. ఈ చిత్రానికి మరికొన్ని అదనపు సన్నివేశాలను జోడించబోతున్నారట. ప్రస్తుతం ‘మహర్షి’ దాదాపు మూడు గంటల నిడివితో థియేటర్లలో ప్రదర్శితమవుతోన్న సంగతి తెలిసిందే. ఈ నిడివిపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సినిమా ప్రధమ, ద్వితియార్థ భాగాల్లో చాలా అనవసర సన్నివేశాలున్నాయని, ఎడిటింగ్‌ సమయంలో వాటిని కాస్త పక్కకు పెట్టి ఉంటే చిత్రం మరింత ఆకట్టుకునేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరికొన్ని సీన్స్‌ జత చేయాలని చిత్ర బృందం నిర్ణయం తీసుకోవడం ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తోంది. వాస్తవానికి సినిమాలో మహేష్‌ - పూజాల పెళ్లి చూపుల ఎపిసోడ్‌ ఎక్కువగానే ఉండేదట. కానీ, దీన్ని నిడివి గురించి కట్‌ చేశారు. అలాగే క్లైమాక్స్‌లో రైతులతో వచ్చే ఎమోషనల్‌ సీన్స్‌లోనూ కొన్ని తొలగించారట. ఇప్పుడు వీటిని తిరిగి చూపించబోతున్నారట. వీటి మొత్తం నిడివి దాదాపు ఎనిమిది నిమిషాల వరకు ఉండొచ్చని సమాచారం. అంటే ఇప్పుడివి కూడా జత చేస్తే.. విరామ సమయంతో కలుపుకొని ‘మహర్షి’ దాదాపు మూడున్నర గంటలున్న సినిమాగా మారిపోతుంది. మరి ఈ నిడివి చిత్రంపై ఎలాంటి ఫలితాన్ని చూపెడుతుందో తెలియాలంటే మరికొద్ది రోజలు వేచి చూడాల్సిందే. ఎందుకుంటే వీటిని రెండో వారం నుంచి కలపాలని చిత్ర బృందం ఆలోచనగా ఉందట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.

                                     


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.