మరోసారి మహేష్‌ సరసన ‘వసుమతి’?

కొన్ని పాత్రలు నటుల సొంత పేర్ల కంటే ఎక్కువగా గుర్తుంటాయి. ఒక్కోసారి పేరు కంటే వారు నటించిన పాత్రలతోనే అభిమానులకు గుర్తుంటారు. ఇలా తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల్లో ‘వసుమతి’గా చెరగని ముద్ర వేసుకుంది బాలీవుడ్‌ బ్యూటీ కియారా అడ్వాణీ. మహేష్‌ కథానాయకుడుగా వచ్చిన ‘భరత్‌ అనే నేను’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఇందులో వసుమతి పాత్రలో కనిపించి మెప్పించింది. మహేష్‌తో నటించి సూపర్‌ జోడి అనిపించుకుంది. ఇప్పుడీ జంట మళ్లీ కలిసి నటించనున్నారని టాలీవుడ్‌లో వినిపిస్తోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్‌ ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కథానాయికగా కియారా అయితే బావుంటుందని భావిస్తుందట చిత్ర బృందం. చర్చలు సాగుతున్నాయని సమాచారం. త్వరలోనే స్పష్టత రానుంది. మరోసారి మహేష్, కియారా కాంబినేషన్‌పై సినిమా అని తెలియడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. మరోవైపు మహేష్‌ పాత్రపైనా ప్రచారం సాగుతుంది. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో నటించిన ‘స్పైడర్‌’లోని స్పై పాత్రలానే ఇందులోనూ కనిపించబోతున్నాడని సమాచారం. చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.