‘మహేష్‌ 27’ ఫిక్స్‌.. మళ్లీ ఆ దర్శకుడితోనే..

సినీప్రియులకు, మహేష్‌ అభిమానులకు శుభవార్త. ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత మహేష్‌బాబు కథానాయకుడిగా నటించబోయే 27వ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ ఏడాది ‘మహర్షి’తో తనకు ఓ చక్కటి విజయాన్ని అందించిన దర్శకుడు వంశీ పైడిపల్లితోనే ఆయన తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నారట. తాజాగా ఈ విషయాన్ని వంశీ అధికారికంగా ప్రకటించారు. తాజాగా విశాఖపట్నంలో పర్యటించిన ఆయన అక్కడి సింహాచల పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి విలేకర్లతో మాట్లాడుతూ ‘మహేష్‌ 27’పై నోరు విప్పారు వంశీ పైడిపల్లి. ‘‘నా తర్వాతి చిత్రాన్ని మహేష్‌బాబుతో చేయబోతున్నా. ‘సరిలేరు నీకెవ్వరు’ విడుదలయ్యాక షూటింగ్‌ ఎప్పుడు ప్రారంభించాలన్న దానిపై స్పష్టత వస్తుంది’’ అని చెప్పుకొచ్చారు. ఈ చిత్రానికి దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరించబోతున్నట్లు సమాచారం. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇందులో మహేష్‌ ఓ పవర్‌ఫుల్‌ గ్యాంగ్‌స్టర్‌గా దర్శనమివ్వనున్నారట. త్వరలోనే దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడనున్న తెలుస్తోంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.