‘సరిలేరు..’లో ఆ సీన్‌కు ‘మేజర్‌ చంద్రకాంత్‌’ స్ఫూర్తి!!

సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లతో సత్తా చాటుతోంది. మహేష్‌బాబు కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని యువ దర్శకుడు అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆయన సూపర్‌స్టార్‌ కృష్ణ నటించిన ‘అల్లూరి సీతారామరాజు’ చిత్ర సన్నివేశాన్ని ఎంతో చక్కగా ఊపయోగించుకున్నారు. మహేష్‌లోని హీరోయిజాన్ని ఎలివేట్‌ చేస్తూ వచ్చే ఈ సన్నివేశానికి థియేటర్లో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కింది. ఇంతకీ ఈ సీన్‌ను ఇంత చక్కగా తీసుకురావడం వెనకున్న అసలు కథను అనిల్‌ తాజాగా రాఘవేంద్రరావుతో జరిగిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ‘‘నేనొక చిత్రం అనుకున్నప్పుడు ఆ జోనర్‌లో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టిన చిత్రాలు ఏమైనా ఉన్నాయా అని చూస్తాను. వాటి ఆధారంగా ఫస్ట్‌ హోం వర్క్‌ చేస్తాను. దాని ప్రభావం మన చిత్రాలపై పడకుండా కొత్తగా ఏం చెప్పాలని ఆలోచిస్తా. ‘మేజర్‌ చంద్రకాంత్‌’లో ‘‘పుణ్యభూమి నా దేశం’’ పాటలో రాఘవేంద్రరావు గారు చెప్పాలనుకున్నది ఏంటంటే.. రామారావుగారి ద్వారా ఓ అల్లూరి సీతారామరాజు, ఓ సుభాష్‌ చంద్రబోస్, ఒక ఛత్రపతి శివాజీలను చూపించాలనుకున్నారు. దానికి ఆయన ఓ ఫొటో పెట్టుకొని ఓ గీతం నుంచి స్వాతంత్య్ర సమరయోధుల్ని అలా కనెక్ట్‌ చేశారు. నేను దాన్ని ఆదర్శంగా తీసుకొనే ‘సరిలేరు’లో అల్లూరి సీతారామరాజుని తీసుకొచ్చాను’’ అని ఆ ఎపిసోడ్‌ వెనకున్న కథను చెప్పుకొచ్చారు అనిల్‌.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.