బాలీవుడ్‌ ఎంట్రీకి రంగం సిద్ధం..
దర్శకధీరుడు నుంచి వచ్చిన ‘బాహుబలి’ చిత్రాల క్రేజ్‌ పుణ్యామాని ప్రతి చిత్రసీమ పాన్ ఇండియా సినిమాల వైపు దృష్టి సారించడం షురూ చేసింది. కన్నడ నుంచి వచ్చిన కేజీఎఫ్‌, తమిళనాట నుంచి వచ్చిన ‘2.ఓ’, తెలుగు నుంచి దూసుకొచ్చిన సాహో, సైరా.. చిత్రాలు పాన్ ఇండియా ట్యాగ్ లైన్‌తోనే విడుద‌ల‌య్యి సినీప్రియులను అలరించాయి. ఇప్పుడు మ‌హేష్ బాబు కూడా దీనిపై దృష్టి పెట్ట‌బోతున్నాడు.


మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం `స‌రిలేరు నీకెవ్వ‌రు`తో బిజీగా ఉన్నారు. దీని త‌ర‌వాత ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌కత్వం వ‌హించే చిత్రంలో న‌టించ‌బోతున్నారు. `కేజీఎఫ్‌`తో సంచ‌ల‌నం సృష్టించిన ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్‌. ఆ చిత్రం బాలీవుడ్‌లో మంచి వ‌సూళ్లు అందుకుంది. దాంతో ప్ర‌శాంత్ నీల్ పేరు బాలీవుడ్‌లోనూ మార్మోగిపోయింది. ప్ర‌శాంత్‌తో తీసే సినిమాని బాలీవుడ్ లోనూ విడుద‌ల చేయాల‌న్న‌ది మ‌హేష్ ప్లాన్‌. త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఎలానూ ఈ సినిమా వెళ్తుంది. ఈ విధంగా పాన్ ఇండియా ఇమేజ్ ద‌క్కుతుంది. అన్ని భాష‌ల సినీ అభిమానుల అభిరుచుల‌కు త‌గ్గ‌ట్టుగానే క‌థ ఉండాల‌ని మ‌హేష్ సూచించాడ‌ని, ప్ర‌శాంత్ నీల్ అలాంటి క‌థే త‌యారు చేస్తున్నాడ‌ని స‌మాచారం. అతి త్వ‌ర‌లోనే ఈ కాంబినేష‌న్‌కి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉంది.

మ‌రో పాట వ‌దులుతున్న మ‌హేష్ బాబు
మ‌హేష్‌బాబు క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం `సరిలేరు నీకెవ్వ‌రు`. అనిల్ రావిపూడి ద‌ర్శ‌కుడు. విజ‌య‌శాంతి ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఈ సంక్రాంతికి విడుద‌ల కాబోతోంది. ఇప్పుడు ప్ర‌మోషన్ల‌కూ శ్రీ‌కారం చుట్ట‌బోతోంది చిత్ర‌బృందం. 'సరిలేరు నీకెవ్వ‌రు' టైటిల్‌సాంగ్ ఇది వ‌ర‌కే వినిపించారు. ఇప్పుడు ఈ చిత్రంలోని మ‌రో గీతాన్ని విడుద‌ల చేయ‌డానికి చిత్ర‌బృందం స‌మాయాత్తం అవుతోంది. ఈనెల 15న 'స‌రిలేరు..' నుంచి మ‌రో పాట‌ని బ‌య‌ట‌కు వ‌ద‌ల‌నున్నారు. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించిన ఈ పాట‌... ఈ సినిమాపై అంచ‌నాల్ని మ‌రింత‌గా పెంచేలా ఉంటుంద‌ని చిత్ర‌బృందం చెబుతోంది. జ‌న‌వ‌రి 12న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.