మహేష్‌ చిత్రానికి అనిరుధ్‌ స్వరాలు?

హేష్‌ బాబు చిత్రానికి అనిరుధ్‌ సంగీత స్వరాలు సమకూరుస్తున్నాడా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. మహేష్‌ కథానాయకుడుగా దర్శకుడు వంశీ పైడిపల్లి ఓ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వంశీ- మహేష్‌ కాంబినేషన్‌లో సినిమా వస్తుందని తెలినప్పటి నుంచి సంగీత దర్శకుడు ఎవరా? అనే ఆసక్తి మొదలైంది అభిమానుల్లో. ముందుగా మణిశర్మ పేరు తెరపైకి వచ్చింది. గతంలో మహేష్‌- మణిశర్మ కాంబినేషన్‌లో ఎన్నో హిట్‌ చిత్రాలొచ్చాయి. దీంతో మరోసారి మహేష్‌కు మణిశర్మ స్వరాలు అందిస్తున్నాడనే అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇదిలా ఉండగానే మహేష్‌ కొత్త చిత్రానికి సంగీత దర్శకుడు తమన్‌ అంటూ ప్రచారం సాగింది. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన ‘బిజినెస్‌మేన్‌’ శ్రోతల్ని విపరీతంగా అలరించింది. ఇప్పుడు మళ్లీ కలిసి పనిచేస్తున్నారంటూ వార్తలు రావడంతో అంచనాలు పెరిగాయి. చిత్ర బృందం నుంచి స్పష్టత రాకపోవడంతో సందేహంలో ఉన్నారంతా. తాజాగా తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్‌.. మహేష్‌ చిత్రానికి స్వరాలు అందించనున్నాడని వినిపిస్తోంది. ఇప్పటి వరకు మహేష్‌తో పనిచేయని సంగీత దర్శకుడిని తీసుకోవాలని భావించిందట చిత్ర బృందం. ఆ అన్వేషణలో భాగంగా అనిరుధ్‌ను ఎంపిక చేయబోతున్నారని టాక్‌. ‘అజ్ఞాతవాసి‘, ‘గ్యాంగ్‌ లీడర్‌’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచమయ్యాడు అనిరుధ్‌. ఇది నిజమా, కాదా? అధికారిక ప్రకటన రావాల్సిందే.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.