ఆ పాత్రతో బాలయ్యకు పోటీ?

ఒకే చిత్రంలో ఇద్దరు కథానాయకులు నటిస్తే ఎలా ఉంటుందో..ఒకే పాత్రలో ఇద్దరు నటులు కనిపిస్తే అంతకన్నా ఆసక్తి ఉంటుంది. బాలకృష్ణ, మనోజ్‌ విషయంలో ఇదే జరగబోతుంది. గతంలో ఈ ఇద్దరు కలిసి ‘ఊ.. కొడతారా ఉలిక్కిపడతారా’ చిత్రంలో కలిసి నటించిన విషయం తెలిసిందే. ఒకే తెరను పంచుకున్న వీరిద్దరు ఈ ఏడాది ఒకే పాత్రలో నటించేందుకు పోటీకి దిగుతున్నారట. అదే పాత్రంటే? అఘోరా. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య ఓ చిత్రం చేస్తున్నారు. ఇందులో ఆయన రెండు గెటప్పుల్లో దర్శనమివ్వనున్నారు. వాటిలో ఒకటి అఘోరా పాత్ర. ఈ విషయం తెలినప్పటి నుంచి అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. ఆ లుక్‌లో బాలయ్య ఎలా ఉంటాడా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇలాంటి కీలక పాత్రలు పోషించాలంటే కొంచెం సాహసంతో కూడిన వ్యవహారమే. అందుకే ఇలాంటి కథలు అరుదుగా వస్తుంటాయని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. సరికొత్త పాత్రలు పోషించేందుకు యువ హీరోలు సైతం సిద్ధమవుతున్నారు. వినూత్న కథల్ని ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు ముందుండే మనోజ్‌ ఈ ప్రయత్నం చేస్తున్నాడని వినిపిస్తోంది. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత మనోజ్‌ ‘అహం బ్రహ్మాస్మి’ చిత్రంతో వస్తున్నాడు. ఈ చిత్రంలో అఘోరాగా కనిపిస్తాడని టాలీవుడ్‌లో ప్రచారం సాగుతుంది. బాలయ్య, మనోజ్‌..ఇద్దరూ కెరీర్‌లో తొలిసారి అఘోరా పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య చిత్రం చిత్రీకరణ జరుపుకుంటుంది. మనోజ్‌ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. రెండు చిత్రాలు రోజుల వ్యవధిలోనే విడుదలవుతాయని, ఒకే పాత్రతో ఇద్దరు నాయకులు బాక్సాఫీసు సందడి చేస్తారని తెలుస్తోంది. మరి అఘోరాగా ఎవరు ప్రేక్షకుల్ని మెప్పిస్తారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.