ఆ పాత్రను గొల్లపూడి చేస్తేనే న్యాయం అనిపించింది

గొల్లపూడి మారుతీ రావుతో తనకున్నది గురుశిష్య సంబంధమని కథానాయకుడు చిరంజీవి అన్నారు. మారుతీ మరణం పై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మారుతీతో ఉన్న సంబంధాన్ని నెమరువేసుకున్నారు. ' ఇటీవలే మారుతీ కుమారుడు పేరిట నిర్వహించే గొల్లపూడి శ్రీనివాస్ అవార్డ్’ కార్యక్రమానికి వెళ్లాను. తర్వాత మళ్లీ ఆయన్ను కలిసే అవకాశం దొరకలేదు. ఆరోగ్యంగా ఉండేవారు. ఇంతలో ఇలా అవుతుందని ఊహించలేదు. ఆయనకి నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. మేము గురు శిష్యుల్లా ఉండేవాళ్లం. నేను 1979లో ‘ఐలవ్‌యూ’ అనే సినిమా చేసినప్పుడు, ఆ సినిమా నిర్మాత భావన్నా రాయణ నాకు మారుతీ రావుగారిని పరిచయం చేశారు. అప్పటికే ఆయన చాలా పెద్ద రచయిత, నాటక రచయిత, జర్నలిస్టు గా కూడా పనిచేశారు. సాహిత్య పరంగా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తి, విద్యాధికుడు. ఆయన దగ్గర డైలాగ్స్ నేర్చుకో అని నన్ను పంపించారు. ఆ రకంగా గొల్లపూడి డైలాగులు ఎలా పలకాలో తరగతులు నిర్వహించారు. ఈ విధంగా ఆయన నాకు గురువనే చెప్పగలను. ఆ సరదా పరిచయం మాకు స్నేహంగా మారింది. ఖాళీ ఉన్నప్పుడల్లా నేను టి.నగర్‌లో వాళ్లింటికి వెళ్లేవాడ్ని. ఆయన నాతో ఎన్నో సాహిత్య పరమైన విషయాలు పంచుకునేవారు. తన గతం గురించి, గొప్ప గొప్ప కవులు, రచయితల గురించి చెప్తుంటే చాలా ఆసక్తికరంగా వింటుండేవాడిని. సాహిత్యం, రచయితల గురించి తెలుసుకునే అవకాశం ఆయనతో లభించింది. 1982లో కోడిరామకృష్ణగారు నాతో ‘ఇంట్లో రామయ్య వీధిలో క‌ృష్ణయ్య’ సినిమా తీయాలనుకున్నప్పుడు ఆ కథలో ఈ పాత్రని గొల్లపూడి వేస్తే బాగుంటుందని అనగానే నాకు కూడా న్యాయం అనిపించింది. ఒకరకమైన శాడిజం భర్త, కామెడీగా ఉండే క్యారెక్టర్ . ఆయన ఆ పాత్రలో ఒదిగిపోయి అందరి మన్ననలు పొందారు, అలా నా సహనటుడుగా ఆయన చేయడం మంచి అనుభూతినిచ్చింది. ఆ తర్వాత ‘ఆలయ శిఖరం‘ , ‘అభిలాష’, ’ఛాలెంజ్‘ లాంటి వరుసగా ఎన్నో సినిమాలు నాతో కలిసి నటించారు. మేం ఎప్పుడు కలుసుకున్నా గతాన్ని గుర్తు చేసుకునే వాళ్లం. అలాంటి గొప్ప సాహిత్యవేత్త, గొప్ప నటుడు, నాటక రచయిత దూరమవ్వడం చాలా బాధాకరం. వారి కుటుంబానికే కాదు, యావత్తు సినీ ప్రపంచానికే తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను' అని గతాన్ని గుర్తు చేసుకున్నారు చిరంజీవి.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.