సప్త అవతారాలతో దర్శనమివ్వనున్న శౌర్య

నాగశౌర్య - అవసరాల కాంబినేషన్‌కు చిత్రసీమలో మంచి క్రేజ్‌ ఉంది. గతంలో వీరిద్దరి నుంచి వచ్చిన ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ చిత్రాలు మంచి విజయాలు అందుకున్నాయి. అయితే ఇప్పుడు ఈ ఇద్దరూ.. ముచ్చటగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకునేందుకు శరవేగంగా ముస్తాబవుతున్నారు. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి’ అనే ఆసక్తికర టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో శౌర్యకు జోడీగా మాళవిక నాయర్‌ నటిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. అదేంటంటే.. ఈ సినిమాలో శౌర్య 7 విభిన్నమైన గెటప్పుల్లో సందడి చేయనున్నాడట. అవన్నీ చాలా ప్రత్యేకంగా.. సినిమాకు హైలైట్‌ అయ్యేలా ఉండబోతున్నాయని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోందట. మరి ఆయన 7 గెటప్పుల వెనకున్న కథేంటి? అన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు. ప్రస్తుతం శౌర్య ఈ చిత్రంతో పాటు.. ‘అశ్వద్థామ’, ‘పార్థు’ అనే ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.