తాత పాటలతో అల్లరి చేయనున్న చైతూ

‘సవ్యసాచి’లో తన తండ్రి నాగార్జున హిట్‌ గీతం ‘‘నిన్ను రోడ్డు మీద చూసినాది లగ్గాయిత్తు’’కు స్టెప్పులేసి అలరించిన అక్కినేని నాగచైతన్య.. ఇప్పుడు తన కొత్త చిత్రం కోసం తాత ఏయన్నార్‌ ఆ పాత మధుర గీతాలతో అల్లరి చేయబోతున్నారట. ఈ అక్కినేని హీరో.. ప్రస్తుతం శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్‌స్టోరీ’ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. తెలంగాణ ప్రాంతంలో జరిగే సరికొత్త ప్రేమకథతో రూపొందిస్తున్న చిత్రమిది. ఈ చిత్రం కోసం తొలిసారి తెలంగాణ భాషలో మాట్లాడబోతున్నారు చై. శరవేగంగా చిత్రీకరణ జరుగుతోన్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పుడొక ఆసక్తికర వార్త బయటకొచ్చింది. ఇందులో చైతూ.. సాయి పల్లవిని అల్లరి చేసే ఓ ఎపిసోడ్‌ ఉంటుందని తెలుస్తోంది. దీన్ని అక్కినేని నాగేశ్వరరావు చిత్రాల్లోని పలు అల్లరి పాటలతో వినోదాత్మకంగా తెరకెక్కించబోతున్నారట. ఈ ఎపిసోడ్‌లో ఆ పాటలన్నింటికీ చైతూ తన తాతగారి స్టైల్‌లో అదిరిపోయేలా స్టెప్పులు వేయబోతున్నారని సమాచారం. ఇది సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.