రామోజీ ఫిలింసిటీలో యాక్షన్‌ హంగామా
గ్ర హీరోల చిత్రాల్లో ఎన్ని రకాల సన్నివేశాలున్నా యాక్షన్‌ సీన్లకున్న క్రేజే వేరు. అభిమాన కథానాయకుడు ఫైటింగ్‌ ఇరగదీస్తుంటే అభిమానులు మురిసిపోతారు. మాస్‌ని ఆకట్టుకోవాలంటే యాక్షన్‌ మసాలా ఉండాల్సిందే. ఎంత వైవిధ్యమైన చిత్రాలు చేస్తున్నా ఫైటింగుల్ని మాత్రం మర్చిపోరు స్టార్‌ హీరోలు. ఇక రజనీకాంత్‌ లాంటి హీరోల ఫైటింగ్‌లకు ఉండే క్రేజే వేరు. ఇటీవలే ‘దర్బార్‌’తో తనలోని సరికొత్త యాక్షన్‌ హీరోని చూపించిన రజనీ మరోసారి సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు. మాస్‌లో మంచి క్రేజ్‌ ఉన్న మరో తమిళ హీరో విక్రమ్‌. ఈ ఇద్దరే కాదు మన్మథుడు నాగార్జున కూడా ఫైటింగ్‌ షురూ చేశారు. ఈ అగ్ర హీరోల పోరాటాలకు రామోజీ ఫిలింసిటీ వేదికైంది.


నాగ్‌ పోరాటానికి సయామీ తోడు
నాగార్జున ఎన్‌.ఐ.ఎ అధికారిగా నటిస్తున్న చిత్రం ‘వైల్డ్‌ డాగ్‌’. దుర్మార్గుల భరతం పట్టడానికి తుపాకీ పట్టుకున్న ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌ విజయ్‌వర్మగా నాగ్‌ కనిపిస్తారు. ఆయన చేసే యాక్షన్‌ హంగామా కోసం రామోజీ ఫిలింసిటీలో ప్రత్యేకంగా ఇల్లు సెట్‌ వేశారు. ఇందులో నాగార్జున, సయామీ ఖేర్‌ తదితరులపై పోరాట సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు అహిషోర్‌ సాల్మన్‌. ఇందులో సయామీ ‘రా’ ఏజెంట్‌గా అతిథి పాత్రలో కనిపించనుంది. దియా మీర్జా నాయిక. నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌రెడ్డి నిర్మిస్తున్నారు.

ఓడలో డిష్యుం డిష్యుం
మణిరత్నం తెరకెక్కిస్తోన్న తమిళ చిత్రం ‘పొన్నియన్‌ సెల్వన్‌’. విక్రమ్, ఐశ్వర్యరాయ్, కార్తి, జయం రవి, త్రిష, ప్రభు, అదితి రావ్‌ హైదరీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చారిత్రక నేపథ్య చిత్రమిది. ఈ చిత్రంలోని కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం ప్రత్యేకంగా ఓడను తీర్చిదిద్దారు. అందులోనే ప్రస్తుతం కార్తి, జయం రవి తదితరులపై పోరాట సన్నివేశాలను తీస్తున్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్యరాయ్‌ ప్రతినాయిక ఛాయలున్న పాత్రని పోషిస్తున్నారు. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం తొలి భాగం 2021లో రానుంది.

పబ్‌లో రజనీ ఫైట్‌
రజనీకాంత్‌ మరోసారి యాక్షన్‌ ధమాకా చూపించడానికి సిద్ధమవుతున్నారు. రజనీ 168వ సినిమా గత ఏడాది చివర్లో మొదలైంది. శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలోని కీలక సన్నివేశాల చిత్రీకరణ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. పబ్‌ నేపథ్యంలో సాగే పోరాట ఘట్టాల్ని రజనీకాంత్‌ తదితరులపై తెరకెక్కిస్తున్నారు. దీని కోసం పబ్‌ సెట్‌ను తీర్చిదిద్దారు. ఈ చిత్రంలో రజనీ మూడు పాత్రల్లో నటించనున్నారు. కీర్తి సురేష్, మీనా, ఖుష్బు నాయికలు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.