‘నిర్వాణను కోరి’ అంటోన్న నాని..
తేడాది నానికి ‘కృష్ణార్జున యుద్ధం’, ‘దేవదాస్‌’ల రూపాల్లో కాస్త ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ.. ఈ ఏడాది మాత్రం ఫుల్‌ హ్యాపీగా సాగిపోతుంది. ‘జెర్సీ’ వంటి హిట్‌తో ఈ కొత్త ఏడాదిని ఎంతో ఉత్సాహంగా ప్రారంభించిన నాని.. తాజాగా ‘గ్యాంగ్‌లీడర్‌’తో మరింత హుషారైపోయాడు. ప్రస్తుతం ఈ ఉత్సాహంలోనే ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘వి’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో మునిగిపోయాడు. అయితే ఇప్పుడిది సెట్స్‌పై ఉండగానే తన తర్వాతి చిత్రాలను ఒకొక్కటిగా లైన్లో పెట్టేసుకుంటున్నాడు నాని. త్వరలో ఆయన నందిని రెడ్డి దర్శకత్వంలో ‘అన్ని మంచి శకునములే’ చిత్రం చేయబోతున్నట్లు తెలుస్తోంది. వైజయంతి మూవీస్‌, స్వప్న సినిమాస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. ఇది పూర్తయిన వెంటనే మరో అదిరిపోయే కథను పట్టాలెక్కించనున్నాడట నాని. ఇంతకీ ఆయనకు కథ చెప్పిన దర్శకుడు మరెవరో కాదు.. నేచురల్‌ స్టార్‌కు ‘నిన్నుకోరి’ వంటి హిట్‌ ఇచ్చిన దర్శకుడు శివ నిర్వాణ. ఆయన ఈ ఏడాది చైతూ - సమంతలతో కలిసి ‘మజిలీ’ వంటి బ్లాక్‌బస్టర్‌ను ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు మరోసారి నానితో కలిసి సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడట. ఇప్పటికే నానితో నిర్వాణ కథ చెప్పేశాడని.. స్టోరీలైన్‌ నచ్చడంతో ఆయన కూడా సినిమాకు ఓకే చెప్పినట్లు సమాచారం. అంతేకాదు ఈ కథలో మరో ట్విస్ట్‌ కూడా ఉందట. ఇదొక మినీ మల్టీస్టారర్‌ చిత్రంలా తెరకెక్కించేందుకు ప్లాన్‌ చేస్తున్నాడట శివ. ఇందులో రెండవ కథానాయకుడి పాత్ర కూడా చాలా కీలకం కానుందట. అందుకే దీని కోసం యువ హీరో ఆది పినిశెట్టిని మళ్లీ తీసుకురాబోతున్నాడట శివ. ‘నిన్ను కోరి’ చిత్ర విజయంలో నాని - ఆదిల కాంబినేషన్‌కు మంచి పేరొచ్చింది. కాబట్టి ఈ చిత్రంతోనూ ఆ మ్యాజిక్‌ను రిపీట్‌ చేయాలని భావిస్తున్నాడట శివ. వచ్చే ఏడాది ప్రధమార్థంలో ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లి ఏడాది చివరి నాటికి విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడట శివ. దీనికి సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మాతలుగా వ్యవహరించనున్నారట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.