ఓవైపు నిర్మాతగా.. మరోవైపు ప్రతినాయకుడిగా!
కథల ఎంపికలో నానికి ఉన్నంత పట్టు తెలుగులో మరే కథానాయకుడికీ లేదంటే అతిశయోక్తి కాదు. వైవిధ్యమైన కథాంశాలతో వరుస హిట్లు కొట్టి మరీ ఈ విషయాన్ని నిరూపించుకున్నారాయన. ఇదే ఆయన్ని మంచి అభిరుచి గల నిర్మాతగానూ మార్చింది. గతేడాది ఆయన నిర్మాతగా ప్రశాంత్‌ వర్మను దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘అ!’ వంటి ప్రయోగాత్మక కథను తెరపైకి తెచ్చి మెప్పించారు. ఇప్పుడు మరోసారి అలాంటి వైవిధ్యమైన కథతోనే తన రెండో చిత్రాన్ని నిర్మించబోతున్నారట నాని. ‘పిట్టగోడ’ చిత్రంతో అందరి దృష్టినీ ఆకర్షించిన యువ దర్శకుడు అనుదీప్‌ ఇటీవలే నేచురల్‌స్టార్‌కు ఓ కథ వినిపించారట. ఓ సరికొత్త కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ స్క్రిప్ట్‌ ఆయనకు బాగా నచ్చడంతో తన సొంత బ్యానర్‌లో నిర్మించేందుకు రెడీ అయ్యారట. అయితే దీన్ని అశ్వనీదత్‌ కుమార్తె స్వప్నదత్‌తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తాడట. ఆమె కూడా మంచి అభిరుచి ఉన్న నిర్మాతే. గతంలో నాని నటించిన ‘ఎవడే సుబ్రమణ్యం’కు ఆమె నిర్మాతగా వ్యవహరించారు. తాజాగా ‘మహానటి’ వంటి బ్లాక్‌బస్టర్‌ను ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ చిత్రంలో రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి, నవీన్‌ పొలిశెట్టి, షాలిని పాండే ప్రధాన పాత్రల్లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం.

* సెట్స్‌పైకి వెళ్తున్న.. నాని - ఇంద్రగంటి
నాని - సుధీర్‌ బాబు ప్రధాన పాత్రల్లో ఇంద్రగంటి మోహనకృష్ణ ఓ కొత్త చిత్రాన్ని తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ మల్టీస్టారర్‌లో నాని ఓ ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించనుండగా.. సుధీర్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా దర్శనమిస్తారట. దీనికి తొలుత ‘వ్యూహం’ అనే టైటిల్‌ను పరిశీలించినట్లు వార్తలొచ్చినప్పటికీ అది వాస్తవం కాదని తెలిసింది. ఇప్పుడీ సినిమాను పట్టాలెక్కించేందుకు ముహూర్తం ఖరారు చేశారట ఇంద్రగంటి. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని బుధవారం లాంఛనంగా మొదలుపెట్టబోతున్నారట. ఎలాంటి మీడియా హడావుడి లేకుండానే చాలా సింపుల్‌గా కార్యక్రమాన్ని పూర్తి చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో నానికి జోడీగా అదితీరావ్‌ హైదరీ, సుధీర్‌ సరసన నివేద థామస్‌ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ బాలీవుడ్‌ సంగీత దర్శకుడు అమిత్‌ త్రివేది స్వరాలు సమకూర్చబోతున్నారట.
సంబంధిత వ్యాసాలు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.