వచ్చే సంక్రాంతికి నాని కానుక ఇదే!!

ఏడాదిలో నాని నుంచి రెండు చిత్రాలు రావడం ఇప్పటికే ఖాయమైపోయింది. వీటిలో ఒకటి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో చేస్తోన్న ‘వి’ కాగా.. మరొకటి శివ నిర్వాణతో చేయనున్న ‘టక్‌ జగదీష్‌’. వీటిలో ఇంద్రగంటితో చేస్తోన్న చిత్రం ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో నాని ప్రతినాయకుడిగా నటిస్తుండగా.. కథానాయకుడిగా సుధీర్‌బాబు దర్శనమివ్వబోతున్నారు. ఇది విడుదలయ్యే లోపే ‘టక్‌ జగదీష్‌’ను కూడా చకచకా పూర్తి చేసి ఈ ఏడాది ద్వితియార్థంలోనే విడుదల చేయాలని లక్ష్యంతో ఉన్నాడు. ఇక వీటితో పాటే ప్రేక్షకుల కోసం సంక్రాంతి కానుకను కూడా అందించేందుకు రెడీ అయ్యారు ఈ నేచురల్‌ స్టార్‌. ఆయన ఈ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ను యువ దర్శకుడు రాహుల్‌ సంకృత్యాన్‌తో కలిసి సిద్ధం చేయబోతున్నాడట. ‘టాక్సీవాలా’ వంటి హిట్‌తో తెలుగులోకి అడుగుపెట్టిన దర్శకుడితను. ఇప్పుడీ చిత్ర తరహాలోనే నాని కోసం ఓ వైవిధ్యభరితమైన కథను సిద్ధం చేశాడు. ఇది నాని కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోయే చిత్రమని సమాచారం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్య దేవర నాగవంశీ దీన్ని నిర్మించబోతున్నారు. అంతేకాదు ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలకు ఛాన్స్‌ ఉండబోతుంది. జూన్‌ - జులై మధ్యలో సెట్స్‌పైకి తీసుకెళ్లే ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్‌ చేస్తున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.