మెరిసేది ఆ కొద్దిసేపేనా.. ఏమిటీ ‘వ్యూహం’??

ప్రస్తుతం సినిమాల ఎంపికలో నాని జోరు రాకెట్‌ కంటే స్పీడుగా సాగుతోంది. ఓవైపు ‘జెర్సీ’ విడుదలకు సిద్ధమవుతుండగానే.. మరో రెండు చిత్రాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారాయన. వీటిలో విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గ్యాంగ్‌లీడర్‌’ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుండగా.. ఇది పూర్తయిన వెంటనే ఇంద్రగంటి మోహనకృష్ణతో ఓ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారు నాని. దీనికి ‘వ్యూహం’ అనే టైటిల్‌ను ఖరారు చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఇందులో నాని ప్రతినాయక లక్షణాలున్న పాత్రలో కనిపిస్తారని, సుధీర్‌బాబు కథానాయకుడిగా నటిస్తారని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఇదో మల్టీస్టారర్‌ మూవీ అని సినీప్రియులంతా ఫిక్స్‌ అయిపోయారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. నాని ఈ మూవీలో కనిపించేది కొద్దిసేపే అని తెలుస్తోంది. సుధీర్‌ కథానాయకుడిగా కనిపించనుండగా.. నేచురల్‌స్టార్‌ కేవలం 15 నుంచి 20 నిమిషాల వరకే తెరపై సందడి చేయనున్నారట. అలా అని అతిథి పాత్ర కాదు. సినిమాకు సంబంధించిన అత్యంత కీలకమైన పాత్రనే పోషించబోతున్నారట. అంతేకాదు ఈ మూవీకి దిల్‌రాజుతో పాటు నాని కూడా నిర్మాతగా వ్యవహరించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి వీటిలో వాస్తవమెంతన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు. 


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.