నాని ఇవ్వబోతున్న సర్‌ప్రైజ్‌ ఏంటి?

దసరా పండుగ హడావుడి తెలుగు చిత్రసీమలో బాగా కనిపిస్తోంది. ఇప్పటికే ‘వెంకీమామ’, ‘సోలో బ్రతుకే సో బెటరూ’, ‘గోల్డెన్‌ ఫిష్‌’, ‘నిశ్శబ్దం’ తదితర చిత్రాల సర్‌ప్రైజ్‌లతో సినీప్రియులు తడిసి ముద్దవుతుండగా.. అల్లు అర్జున్, మహేష్‌బాబు తదితరులు తమ కానుకలు చూపించేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే వీరితో పాటు తానూ ఓ పండుగ కానుక ఇవ్వబోతున్నాడట నాని. ఇటీవలే ‘గ్యాంగ్‌లీడర్‌’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించిన నాని.. త్వరలో ‘వి’తో వినోదాలు పంచబోతున్నాడు. ఓవైపు హీరోగా బిజీగా ఉంటూనే నిర్మాతగానూ తన సొంత బ్యానర్‌లో మరో చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నాడు. దసరా కానుకగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్‌ను ప్రేక్షకులతో పంచుకోబోతున్నాడట. ‘అ!’ ప్రశాంత వర్మ అనే నూతన దర్శకుడిని చిత్రసీమకు అందించిన నాని.. ఈ కొత్త చిత్రంతో మరో దర్శకుడిని తెరపైకి తీసుకురాబోతున్నాడట. ఈ సినిమాలో విశ్వక్‌ సేన్‌ కథానాయకుడిగా నటించనున్నాడు. ఇప్పటికే ప్రీప్రొడక్షన్‌ పనులను పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. అక్టోబరు 25 నుంచి సెట్స్‌పైకి వెళ్లబోతుందట. కేవలం 50 రోజుల్లోనే ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారట. మరి ఈ దసరా కానుకగా ఈ చిత్ర టైటిల్‌ను కూడా తెలియజేస్తాడా? లేక సినిమాకు సంబంధించిన మరేదైనా విశేషాలు పంచుకుంటాడా? అన్నది వేచి చూడాలి. ఒకవేళ సర్‌ప్రైజ్‌లా ‘వి’ నుంచి ఏదైనా లుక్‌ రిలీజ్‌ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.