‘నరసింహనాయుడు’ మ్యాజిక్‌ మరోసారి

ప్రస్తుతం బాలయ్య చేతిలో రెండు క్రేజీ ప్రాజెక్టులున్నాయి. వీటిలో ఒకటి బోయపాటి శ్రీనుతో చెయ్యనున్న చిత్రం కాగా.. మరొకటి సీనియర్‌ దర్శకుడు బి.గోపాల్‌ది. ఈ ఇద్దరి దర్శకులతో బాలయ్యది మంచి హిట్‌ కాంబినేషన్‌ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా 90ల్లో బాలయ్యతో ‘లారీ డ్రైవర్‌’, ‘రౌడీ ఇన్‌స్పెక్టర్‌’, ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’ వంటి హిట్‌ చిత్రాలు తెరకెక్కించి సినీప్రియుల్ని మురిపించారు గోపాల్‌. అందుకే 17ఏళ్ల గ్యాప్‌ తర్వాత మళ్లీ వీళ్లిద్దరూ కలుస్తున్నారనగానే సినీప్రియుల్లో భారీ అంచనాలు మొదలైపోయాయి. అయితే ఈ ప్రాజెక్టు బోయపాటి శ్రీను చిత్రం తర్వాతే సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. దీనికి మరింత సమయమే ఉన్న నేపథ్యంలో ఈ గ్యాప్‌లో బాలకృష్ణ కోసం ఓ చక్కటి కథను చెక్కించే పనిలోకి దిగారట బి.గోపాల్‌. ఇప్పుడాయన ఈ నందమూరి నట సింహం కోసం రచయిత చిన్ని కృష్ణతో ఓ పవర్‌ ఫుల్‌ యాక్షన్‌ ఎంటరటైనింగ్‌ కథను సిద్ధం చేయిస్తున్నట్లు సమాచారం అందుతోంది. గతంలో వీళ్ల ముగ్గురి కలయికలోనే ‘నరసింహ నాయుడు’ చిత్రం వచ్చింది. దీనికి బాక్సాఫీస్‌ వద్ద అదిరిపోయే ఆదరణ దక్కింది. అందుకే ఇప్పుడదే మ్యాజిక్‌ను మరోసారి రిపీట్‌ చేయించేందుకు కథ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారట గోపాల్‌. చిన్నికృష్ణ. ఎలాగూ తమ చిత్రం పట్టాలెక్కడానికి కావల్సినంత సమయం ఉంది కాబట్టి.. కథ విషయంలో ఎక్కడా ఎలాంటి లోటు పాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చిన్ని కృష్ణకు సూచించారట ఈ సీనియర్‌ డైరెక్టర్‌. ప్రస్తుతం ఆయన ఈ పనిలోనే తలమునకలై ఉన్నట్లు సమాచారం. ఇక బోయపాటి దర్శకత్వంలో బాలయ్య చెయ్యబోయే కొత్త చిత్రం వచ్చే వారం నుంచి రెగ్యులర్‌ షూట్‌కు వెళ్లబోతుంది. వారణాసిలో తెరకెక్కించబోయే కీలక ఎపిసోడ్‌తో ఈ చిత్రీకరణ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్‌లో బాలయ్య అఘోరా లుక్‌లో దర్శనమివ్వబోతున్నట్లు సమాచారం.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.