నవీన్‌.. ‘మిషన్‌ 2020’

బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ ప్రేరణతో యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్న సమకాలీన రాజకీయ నేపథ్య చిత్రం ‘మిషన్‌ 2020’. నవీన్‌ చంద్ర కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. బాబ్జి దర్శకుడు. కుంట్లూర్‌ వెంకటేష్‌ గౌడ్, కెవిఎస్‌ఎస్‌ఎల్‌ రమేష్‌ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాగబాబు, జయప్రకాష్, సత్య ప్రకాష్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను హీరో శ్రీకాంత్‌ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘2020.. సినిమా పరిశ్రమకు పెద్ద సంక్షోభం. ఈ ‘మిషన్‌ 2020’ ఆ సంక్షోభాన్ని ఛేదిస్తుందని భావిస్తున్నా’’ అన్నారు. ‘‘మా చిత్రానికి కథే హీరో. నవీన్‌ చంద్ర, నాగబాబు తదితరులు తమ నటనతో దానికి ప్రాణం పోశారు. జనవరిలో చిత్రీకరణ ప్రారంభించి.. మార్చి నాటికే పూర్తి చేశాం. సినిమా బాగా వచ్చింది. తాజాగా శ్రీ రాపాకతో ఐటెం గీతం పూర్తి చేశాం’’ అన్నారు దర్శకుడు. ‘‘మంచి సందేశమున్న రాజకీయ కథతో చిత్రాన్ని రూపొందిస్తున్నాం. సినిమాలోని ఐదు పాటలు ఆకట్టుకుంటాయి. అక్టోబరులో మా సంస్థలో మరో చిత్రాన్ని ప్రారంభిస్తామ’’న్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం: ర్యాప్‌ రాక్‌ షకీల్, కూర్పు: ఎస్‌ బి ఉద్ధవ్, ఛాయాగ్రహణం: వెంకట్‌ ప్రసాద్‌.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.