నిఖిల్‌కు ఇలా జరుగుతుందేంటి?
యువ కథానాయకుడు నిఖిల్‌కు కొన్నాళ్లుగా ఏం చేసినా పెద్దగా కలిసి రావట్లేదు. ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘అర్జున్‌ సురవరం’ ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్నప్పటికీ ఇప్పటికీ బయటకు రాని పరిస్థితి ఏర్పడింది. అనేక సార్లు విడుదల తేదీలు మార్చుకున్న ఈ సినిమా.. చిన్న చిత్రాలకు అనుకూలంగా ఉండే జూన్‌ - జులై మాసాల్లోనైనా థియేటర్లలోకి వస్తుందనుకున్నారు. కానీ, చిత్ర నిర్మాతల్లో మాత్రం ఎలాంటి స్పందన కనబడటం లేదు. దీంతో ఇది ఎప్పుడు బయటకొస్తుందో చెప్పలేని దుస్థితి నెలకొని ఉంది. ఇక ఇది కాక నిఖిల్‌ చేతిలో మరేదైనా చిత్రం ఉందా అంటే.. కిషన్‌ కట్టా దర్శకత్వం వహిస్తున్న ‘శ్వాస’, చందూ మొండేటి తెరకెక్కించనున్న ‘కార్తికేయ 2’ ఉన్నాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ‘శ్వాస’ సినిమా కూడా ఆగిపోయినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన ఏదీ రానప్పటికీ చిత్ర బృందంతో ఈ యువహీరోకు ఏర్పడిన సృజనాత్మకత విభేదాల కారణంగా సినిమాను ఆపేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పోనీ ‘కార్తికేయ 2’కైనా లైన్‌ క్లియర్‌గా ఉందా అంటే.. లాంఛనంగా అయితే ప్రకటించారు కానీ, అదెప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందన్నది ప్రకటించలేదు. ఇలా నిఖిల్‌కు ఒకదాని తర్వాత మరొకటి వరుస ఎదురు దెబ్బలు తగులుతుండటం సినీవర్గాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. ఆయన చివరిగా ‘కిరాక్‌ పార్టీ’తో ప్రేక్షకుల్ని పలకరించారు. ఇది బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ ఫలితాన్నే అందుకుంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.