క్ష‌ణ క్ష‌ణం సినిమా రీమేక్ చేస్తా

తన జీవితం నుంచి ఓ కొత్త సాహసం రాబోతుందంటూ.. కథానాయకుడు నిఖిల్‌ ఆ మధ్య ట్విటర్‌లో ఓ ఫొటో షేర్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఫొటోలో ఆయన ఏదో కథ రాసుకుంటున్నట్లుగా కనిపించడంతో.. తన నుంచి రాబోతున్న ఆ సాహసం ఏమిటో తెలుసుకోవాలని అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. అయితే ఇప్పుడీ అంశంపై స్పష్టత వచ్చింది. నిఖిల్‌ త్వరలోనే దర్శకుడిగా మారబోతున్నారట. ఈ విషయాన్ని ఈటీవీలో ప్రసారమయ్యే ‘అలీతో సరదాగా’ కార్యక్రమంలో పంచుకున్నారు. సెప్టెంబరు 14న ప్రసారమయ్యే ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలవగా.. దాంట్లో ఈ కొత్త ప్రాజెక్టు వివరాల్ని ప్రస్తావించారు నిఖిల్‌. సామాజిక దూరం పాటిస్తూ.. చాలా తక్కువ మంది సిబ్బందితో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు తెలియజేశారు. తన స్వీయ దర్శకత్వంలో ఐదుగురు పిల్లలతో ప్రయోగాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నట్లు స్పష్టతనిచ్చారు. అవ‌కాశం వ‌స్తే క్ష‌ణ క్ష‌ణం సినిమా రీమేక్ చేస్తాన‌న్నారు.  ప్రస్తుతం ఆయన హీరోగా ‘కార్తికేయ 2’తో పాటు ‘18 పేజీస్‌’ చిత్రాలు చెయ్యబోతున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.