‘విజేత’ను గుర్తుచేస్తున్న ‘భీష్మ’
అలనాటి ‘విజేత’ని గుర్తు చేస్తున్నాడు నేటి ‘భీష్మ’. ఆ విజేత ఎవరో కాదు ప్రముఖ కథానాయకుడు చిరంజీవి. భీష్మ.. యువ హీరో నితిన్‌. మరి చిరును నితిన్‌ గుర్తు చేయడమేంటి అనుకుంటున్నారా? విషయం ఏంటంటే.. నితిన్, రష్మిక జంటగా వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న చిత్రమే ‘భీష్మ’. ఇందులోని ‘సింగిల్స్‌ ఆంథెమ్‌’ వీడియోను ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ప్రకటించే ఓ పోస్టర్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దింది చిత్ర బృందం. బజాజ్‌ చేతక్‌పై స్టైల్‌గా దర్శనమిచ్చాడు నితిన్‌ ఈ ఫొటోలో. ఇప్పుడు ఇదే ఆసక్తి రేకెత్తిస్తుంది. కుడివైపు తెల్ల రంగు, ఎడమ వైపు నీలం, ఎరుపు, పచ్చ రంగులు కలిసిన చొక్కాను ధరించి ఉంటాడు నితిన్‌. అయితే అది నాటి తరానికి చెందిన కాస్ట్యూమ్‌ కావడంతో అందరి దృష్టి దానిపై పడింది. 1985లో వచ్చిన ‘విజేత’ చిత్రంలో చిరు ధరించిన చొక్కాను తలపిస్తుంది. దీంతో టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చ సాగుతుంది. అప్పుడెప్పుడో చిరు వేసిన చొక్కాను మళ్లీ ఇప్పుడు నితిన్‌ ఎందుకు వేశాడు? ఆ సినిమాలోని ఏదైనా సన్నివేశాన్ని ‘భీష్మ’లో నితిన్‌తో చేయిస్తున్నారా? అంటూ సందేహ పడుతున్నారు. దీనికి సమాధానం కావాలంటే ఫిబ్రవరి 21 వరకు ఆగాల్సిందే.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.