మూడో భాగం కూడా వ‌చ్చేదేమో...?!
ప్పుడంటే.. 'ఎన్టీఆర్‌' బయోపిక్కుని డిజాస్ట‌ర్ అంటున్నారు గానీ, ఈ సినిమా మొద‌లెట్టిన త‌ర‌వాత‌.. అంచ‌నాలు భారీగానే ఉండేవి. అటు బాలయ్య‌, ఇటు క్రిష్‌.. వీరిద్ద‌రూ ఈ సినిమాని చాలా ప్రేమించారు. ఎంతో న‌మ్మారు. ఎన్టీఆర్ బ‌యోపిక్‌ని రెండు భాగాలుగా తీస్తున్నారు అన‌గానే - వ్యాపార ప‌రంగా ఇది చాలా మంచి ఎత్తుగ‌డ అని ట్రేడ్ వ‌ర్గాలే విశ్లేషించాయి. పార్ట్ 1 ఫ్లాప్ అవ్వ‌డంతో ఇప్పుడు ఆ స‌మీక‌ర‌ణాలు, అంచ‌నాలు అన్నీ త‌ల‌కిందుల‌య్యాయి. రెండు భాగాలుగా తీయాల‌నుకోవ‌డం పెద్ద పొరపాటు అని తేల్చేశారంతా.


అయితే చాలామందికి తెలియ‌ని విష‌యం ఏమిటంటే.. ఎన్టీఆర్ బ‌యోపిక్ మూడో భాగం కూడా ప్లాన్ చేశారు క్రిష్ - బాల‌య్య‌. తొలి భాగానికి వ‌చ్చిన హైప్ అందుకు ప్ర‌ధాన కార‌ణం. ఎన్టీఆర్ - తెలుగుదేశం పార్టీ ప్రారంభించ‌డంతో తొలి భాగం ముగిసింది. అక్క‌డి నుంచి పార్టీని స్థాపించ‌డం, అధికారంలోకి తీసుకురావ‌డం.. అక్క‌డి నుంచి మొద‌లెట్టి, ఎన్టీఆర్ రెండోసారి ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌డంతో పార్ట్ 2 ముగుస్తుంది. ఎన్టీఆర్ తుది, ఆయ‌న మ‌ర‌ణం.. ఇవ‌న్నీ చివ‌రి భాగంలో చూపిద్దామ‌నుకున్నారు. `మ‌హాభి నిష్క్ర‌మ‌ణం` లాంటి గంభీర‌మైన టైటిల్ లాంటిది ఈ భాగానికి పెట్టాల‌న్న‌ది ప్లాన్‌. పార్ట్ 2 స్క్రిప్టులో ఎన్టీఆర్ చివ‌రి ద‌శ లేదు. ఆయ‌న మ‌ర‌ణాన్నీ చూపించ‌కూడ‌ద‌ని భావించారు. ఎప్పుడైతే `క‌థానాయ‌కుడు` బోల్తా ప‌డిందో - పార్ట్ 2లోనే ఈ సినిమాని ముగించాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. అందుకే హ‌డావుడిగా కొన్ని స‌న్నివేశాలు రాసుకుని, వాటిని తెర‌కెక్కించే ప‌నిలో ప‌డ్డారు. ఇప్పుడు ఎన్టీఆర్ అంతిమ ద‌శ కూడా పార్ట్ 2లో చేర్చేశారు.

Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.