‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో మార్పులు

కరోనా - లాక్‌డౌన్‌ పరిస్థితుల నుంచి కుదుట పడేందుకు తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రభుత్వం తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తోంది. ఇప్పటికే సినిమాల నిర్మాణాంతర పనులు చేసుకోవడానికి అనుమతులు జారీ చేయగా.. చిత్రీకరణల విషయంలో త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోబోతున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే తుది దశ చిత్రీకరణలో ఉన్న చిత్రాలన్నీ సెట్స్‌పైకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే చిత్రీకరణలకు ప్రభుత్వం నుంచి అనుమతులు దక్కినా.. మునుపటిలా చిత్రీకరణలు కొనసాగించడం సాధ్యపడదనేది వాస్తవం. అందుకే పలు చిత్ర బృందాలు తమ కథల్లో చిన్నపాటి మార్పులు చేసుకుంటున్నాయి. ఇప్పుడిలాంటి చిత్రాల జాబితాలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కూడా ఉన్నట్లు సమాచారం. రాజమౌళి ఇప్పటికే ఈ చిత్ర విడుదలపై ఓ స్పష్టత ఇచ్చిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న విడుదల చేయడానికి ఇప్పటికే ముహూర్తం ఖరారు చేసుకున్నారు. కానీ, ప్రస్తుత కరోనా పరిస్థితుల కారణంగా అనుకున్న సమయానికి రావడం కుదిరే పనేనా? అని అందరిలోనూ అనుమానాలు నెలకొని ఉన్నాయి. కానీ, రాజమౌళి మాత్రం చెప్పిన తేదీకే చిత్రాన్ని తీసుకురావాలని దృఢ నిశ్చయంతో ఉన్నట్లు సమాచారం. దీనికి తగ్గట్లుగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ స్క్రిప్ట్‌లో కీలక మార్పులు చేసుకుంటున్నారట. భారీ యాక్షన్‌ సీక్వెన్స్, అవుట్‌ డోర్‌ షెడ్యూల్‌ సీన్స్‌ విషయంలో ఈ మార్పులు ఉండనున్నట్లు తెలుస్తోంది. వీలైనంత వరకు తక్కువ మందితో హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోనే వేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకునేలా రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎలాగూ ఇప్పటికే 80శాతానికి పైగా చిత్రీకరణ పూర్తయింది కాబట్టి.. ఇప్పుడు చేసే మార్పులు కథపై పెద్దగా ప్రభావం చూపవని ధీమాతో ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి ఎంత త్వరగా చిత్రీకరణలకు అనుమతులు దొరికితే అంత త్వరగా సెట్స్‌లోకి అడుగుపెట్టాలని ఆతృతగా ఎదురుచూస్తున్నారట జక్కన్న. ఈ విషయంలో ఆయనకు కథానాయకులు ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల నుంచి కూడా చక్కటి మద్దతు దక్కుతోందట.
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.