మరో పీరియాడిక్‌ డ్రామా..

మాస్, క్లాస్, యాక్షన్, ఫిక్షన్‌.. ఇలా ఏ తరహా కథాంశంలోనైనా చక్కగా ఒదిగిపోగలరు యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌. ఇప్పుడాయన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం కోసం తొలిసారి స్వాతంత్య్ర సమరయోధుడి పాత్రలోకి అడుగుపెట్టారు. ఇందులో ఆయన గోండు వీరుడు కొమరం భీమ్‌ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. 1920 కాలం నాటి భారత స్వాతంత్య్ర పరిస్థితుల నేపథ్యంలో చక్కటి పీరియాడిక్‌ డ్రామాగా ముస్తాబవుతోంది. అయితే ఇప్పుడు ఇదే తరహాలో తారక్‌ కోసం అదిరిపోయే కథను సిద్ధం చేస్తున్నారట దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, త్రివిక్రమ్‌ చిత్రాల తర్వాత ఎన్టీఆర్‌ చెయ్యబోయే కొత్త సినిమా ప్రశాంత్‌ దర్శకత్వంలో ఉండనున్నట్లు ఇప్పటికే ఖరారైంది. పాన్‌ ఇండియా స్థాయిలో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ దీన్ని నిర్మించబోతుంది. ఇప్పుడీ చిత్ర కథాంశానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. దీన్ని కూడా ఓ చక్కటి పీరియాడిక్‌ డ్రామా కథాంశంగానే సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారట ప్రశాంత్‌. ఇప్పటికే ఆ కథను తారక్‌కు కూడా వినిపించడం జరిగింది. పస్తుతం తన దర్శకత్వంలో రూపొందుతోన్న ‘కెజిఎఫ్‌ 2’ చిత్రీకరణ పూర్తికాగానే ఎన్టీఆర్‌ సినిమా స్క్రిప్ట్‌ పనిని ప్రారంభించనున్నారని సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాదిలో ఇది సెట్స్‌పైకి వెళ్లే అవకాశముంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.